ఓటమి భయంతో ఈవీఎంలపై అభాండాలు


కోల్‌కతాలో శనివారం ఐక్యతా సభను నిర్వహించిన విపక్ష కూటమిలోని పక్షాలలో అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదనే అవి సంజాయిషీ కోసం కారణాలను వెతుక్కుంటూ ఈవీఎంలను నిందిస్తున్నాయని విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి మోదీ సర్కార్‌ను గద్దెదించాలని కోల్‌కతా సభలో ప్రతినబూనిన విపక్ష నేతలు.. ఎన్నికల్లో అన్నిరకాల అక్రమాలకు ఈవీఎంలే (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలే) కారణమని, కనుక ఇకపై ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో మోదీ ఈ విమర్శలు గుప్పించారు. 

అది మహాకూటమి కాదని, అవినీతి, అస్థిరతతో కూడిన తిరోగమన కూటమి అని ప్రధాని మండిపడ్డారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్ర, దక్షిణ గోవాలోని కొల్హాపూర్, హత్కననంగ్లే, మాధా, సతా లోక్‌సభ స్థానాల బూత్ లెవెల్ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. విపక్షాలకు ధనబలం ఉంటే.. బీజేపీకి ప్రజాబలం ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు.

జనరల్ క్యాటగిరీలోని ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లను అమలుపరిచేందుకు విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచుతామని మోదీ ప్రకటించారు. విపక్షాల సభలో వేదికను పంచుకున్న ఓ నాయకుడు బోఫోర్స్ కుంభకోణం గురించి ప్రస్తావించడాన్ని మీరు చూసే ఉంటారు. వాస్తవాన్ని ఎన్నటికీ దాచలేరు. ఆ కూటమిలో పార్టీలు పరస్పరం పొత్తు పెట్టుకుంటే.. మనం 125 కోట్ల మంది భారతీయులతో, వారి ఆశలు, ఆకాంక్షలతో పొత్తు పెట్టుకున్నాం అని మోదీ ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

కొన్ని గ్రూపులు ప్రజలను తెలివిలేనివారిగా భావించి తమ అవసరాలకు వాడుకోవడం ఆందోళనకరమని, ఇది ఎంతో ప్రమాదకరమైన క్రీడ అని వ్యాఖ్యానించారు. విపక్ష నేతలు తమ కుటుంబాల స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతుంటే.. మనం దేశాభివృద్ధికి పాటుపడుతున్నాం అని మోదీ పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని నమ్మలేని వారు ఇప్పుడు బహిరంగ వేదికలెక్కి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాట్లాడటం హాస్యాస్పదమని మోదీ మండిపడ్డారు. వారికి వ్యవస్థలపై ఎలాంటి నమ్మకం లేదని, పైగా రాజ్యాంగ విలువలను తగ్గించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారని విమర్శించారు. తమ కుటుంబాలను ఎలా పైకి తేవాలా అని వారు ఆలోచిస్తుంటే జాతిని ఎలా అభివృద్ధి చేయాలా అని తాము తపన పడుతున్నామని మోదీ తెలిపారు.  పంచాయతీ స్థాయిలో సైతం పోటీ చేసే వ్యక్తులపై హింసకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ పాటపాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర నిర్ణయం ప్రతిపక్షాలకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని ప్రధాని ఎద్దేవా చేశారు.  ఈ నిర్ణయం బలమైనది కాకపోతే విపక్షాలకు నిద్రలేని రాత్రులు ఉండేవి కాదని, అప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి అబద్ధాలను, వదంతులను వ్యాప్తి చేసేవని, దీన్నిబట్టి చూస్తే మనం సరిగానే పనిచేస్తున్నామని, దేశాభివృద్ధి కోసం కృషిచేస్తున్నామని స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటా యథాతథంగా కొనసాగుతుందని మోదీ తెలిపారు. గతంలో మన ప్రభుత్వాలు కుంభకోణాలతో అంతర్జాతీయంగా ప్రధాన శీర్షికల్లో నిలిచేవని, ఇప్పుడు ఎక్కడా కుంభకోణాల ఊసే లేదన్నారు. అంతకుముందు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పారికర్‌ను ఆధునిక గోవా రూపకర్తగా మోదీ అభివర్ణించారు.