రాష్ట్రపతి పాలన కావాలంటే మోదీని అడ్డుకోండి


ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు వస్తే అడ్డుకొంటామని తెలుగు దేశం నాయకులు ప్రకటనలు ఇస్తూ ఉండటం పట్ల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలి అనుకొంటే  ప్రధానిని అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రకటన చేయమని సవాల్ చేశారు. టిడిపి నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 

అవినీతి, ఆర్బాటం, ప్రచారం తప్ప ఏపీకి సీఎం చంద్రబాబు చేసింది శూన్యమన జీవిఎల్‌ దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు పసుపు ముసుగు వేశారని విమర్శించారు. అన్ని ముసుగులను తొలగిస్తామని చంద్రబాబు బండారం బయటపెడతామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు చేసిన అవినీతి, అక్రమాలకు జైలు వెళ్లడానికి సిద్దంగా ఉండాలని జీవిఎల్‌ సూచించారు.

చంద్రబాబు నాయుడు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి చంద్రబాబు ఓ క్యాంపెనర్‌గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలు ముఖ్యం కాదని ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ సహాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పనిలో చంద్రబాబు కమీషన్‌లు దండుకుంటున్నారని ఆరోపించారు.  ఒక్క నితిన్ గడ్కరి శాఖ నుంచే మూడు లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయని వివరించారు.

‘నోట్ల రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసింది నేనే'  అని చెప్పిన మాటలు చంద్రబాబు మర్చిపోయారా?  అని కన్నా నిలదీశారు. డీమానిటైజేషన్‌ కమిటీకి కన్వీనర్‌ చంద్రబాబే గుర్తుంది కదా అంటూ ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే దానికి బాబే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 

మోదీ మరలా ప్రధాని అయితే జైలుకు పోతామనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మోదీ అంతటి ధైర్యశాలైన ప్రధానిని చూడలేదని కన్నా చెప్పారు. 2014 కంటే అత్యధిక మెజారిటీతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని విశ్వాసం వక్తం చేశారు. 

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

షెడ్యూల్ కులాల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో కూడిన ఎస్సీ వర్గీకరణ అంశానికి బీజేపీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కన్నా మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి 19న నిర్వహించే మాదిగ విశ్వరూప సభకు ఏపీ బీజేపీ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. 

సోమవారం విజయవాడకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఇచ్చేలా చట్టం తీసుకొచ్చేలా కృషిచేయాలని కోరతామని హామీ ఇచ్చారు. అంతకుముందు మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గంగా మాదిగలు ఉన్నారని, ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మాదిగ విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు.