ఉగ్రవాదం, అవినీతిలపై రాజీలేని పోరుకు వెంకయ్య పిలుపు

ప్రపంచదేశాలను పట్టిపీడించే ఉగ్రవాదం, వాతావరణంలో అసాధారణ ఉష్ణోగ్రతల మార్పులు, అవినీతిపై రాజీలేని విధంగా పోరాడేందుకు ప్రజలు సమష్టిగా పోరాడాలని ఉప రాష్ట్రపతి ఏం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.  9వ వైబ్రాంట్  గుజరాత్  గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ  శాంతి, అభివృద్ధి సాధనలో అన్ని దేశాలు భాగస్వాములు కావాలని కోరారు. శాంతి లేకుండా అభివృద్ధిని సాధించలేమని స్పష్టం చేశారు. 

ఉగ్రవాదానికి మతం లేదని, మానవాళికి పెనుముప్పుగా పరిణమించిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుంటే తప్ప ఉగ్రవాదాన్ని తరిమిగొట్టలేమని హితవు చెప్పారు. వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పర్యావరణ పరిరక్షణ సమతుల్యత దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ చొరవ తీసుకోవడం వల్ల 121 దేశాలు సౌరశక్తి వేదికపైకి వచ్చాయని పేర్కొన్నారు. 

అవినీతి వల్ల వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని పేర్కొంటూ అభివృద్ధికి అవినీతి సవాలుగా మారిందని హెచ్చరించారు. అక్రమార్జనపరులు నకిలీ అకౌంట్లను తెరిచి ధనాన్ని మళ్ళిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక వనరులను దోపీడీ చేసి దేశం వదిలి పారిపోయి విదేశాలను నక్కిన వారిని తీసుకువచ్చి శిక్షించాలని స్పష్టం చేశారు. 

గత 15 ఏళ్లలో దేశాభివృద్ధి పరిశ్రమలకు మాత్రమే పరిమితం కాలేదని చెబుతూ వౌలిక సదుపాయాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వెంకయ్య నాయుడు తెలిపారు. సామాజిక, ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో మార్పులు వస్తున్నాయని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలు కేంద్రం తెచ్చిన ఆర్థికసంస్కరణల వల్ల పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు. ఈ తరహా సదస్సులను నిర్వహించడం వల్ల భారత్ అభివృద్ధి, పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ప్రపంచదేశాలకు తెలుస్తాయచెప్పారు. 

గుజరాత్ పర్యటనలో భాగంగా అంతకు ముందు "ఐక్యతా విగ్రహం" సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించి, మాజీ ఉప ప్రధానికి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత పటేల్‌కే దక్కుతుందని తెలిపారు. సర్దార్ పటేల్ విగ్రహం దేశ ఐక్యతకు చిహ్నమని, ఆయన పట్ల దేశ ప్రజలు కృతజ్ఞతా భావాన్ని కలిగివుంటారని చెప్పారు. దేశ చరిత్ర గురించి, ముఖ్యంగా పటేల్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అందరూ సందర్శించాలని సూచించారు. 

 మొదటి దేశ ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా పటేల్ చేసిన సూచనలు, సలహాలు అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘ఉక్కు మనిషి’ పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అలాగే బ్రిటిష్ వలస పాలకుల నుంచి స్వేచ్ఛను పొందేందుకు సుదీర్ఘమైన పోరాటం సాగించి, దేశానికి స్వరాజ్యాన్ని సాధించిపెట్టిన మహాత్మా గాంధీ, దేశాన్ని ఏకీతృతం చేసిన నవీన భారతదేశ రూపశిల్పి పటేల్, ఇద్దరూ గుజరాజ్ రాష్ట్రానికే చెందినవారు కావడం ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణామని పేర్కొన్నారు. 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత 565 గణ రాజ్యాలను పటేల్ విలీనం చేయకపోతే, చాలావరకు స్వతంత్ర దేశాలుగా ఇప్పటికీ కొనసాగేవని చెప్పారు. ఏడాది కాలంలో అన్ని గణ రాజ్యాలను ఏకం చేసి, భారతదేశ సాంస్కృతిని, ఐక్యతను, సామరస్యాన్ని సర్దార్ పటేల్ కాపాడారని కొనియాడారు. సువిశాలమైన భారతదేశం సాకారం కావాలంటే, మందుగా భారతదేశం ఏకం కావాలని పటేల్ భావించారని వెల్లడించారు. పటేల్ సంకల్పమే ఆయనకు భారతదేశ ఉక్కుమనిషిని చేసిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.