జమ్మూకశ్మీర్ లో ఒంటరిగానే బీజేపీ పోటీ

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత కొందరు మిత్రులతో కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని సీట్లలోనూ బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు. సుస్థిర ప్రభుత్వం కోసం కలిసొచ్చే మిత్రులను కలుపుకొని వెళ్లేందుకు వెనుకాడమని ఆయన తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరుగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరి 3న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని రామ్ మాధవ్ తెలిపారు. ఏప్రిల్-మేలో పార్లమెంటు ఎన్నికలు జరుగనుండగా, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఈ రెండు ఎన్నికలూ ఒకేసారి జరుపుతారా, విడివిడిగా జరుపుతారా అనేది ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్నందున రాబోయే ఆరు నెలల్లో ఎసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని గత నవంబర్‌లో ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సానుకూలంగా లేదంటూ వస్తున్న వదంతులను రామ్ మాధవ్ కొట్టివేశారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే కొన్ని పార్టీలు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుకుంటున్నట్టు ఆరోపించారు. 

కశ్మీర్ పండిట్ల పునరావాసంపై అడిగిన ఓ ప్రశ్నకు...కశ్మీర్ పండిట్ల సహాయ, పునరావాసానికి, రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు తాము రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని వెల్లడించారు. కశ్మీర్ లోయలో సానుకూల పరిస్థితి నెలకొనగానే దానిని అమలు చేస్తామని తెలిపారు. పండిట్ టౌన్‌షిప్స్‌ కోసం ఐదు ప్రాంతాలను తాము గుర్తించినప్పటికీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపంలోకి దాల్చలేదని పేర్కొన్నారు. భద్రతా పరిస్థితులే ఇందుకు ఓ ప్రధాన కారణమని ఆయన చెప్పారు.