వచ్చే బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట

 వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అవకాశాలు మెండుగాకనిపిస్తున్నాయి. వచ్చే నెల 1న పార్లమెంట్ వేధికగా ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.12 లక్షల కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.11 లక్షల కోట్లతో పోలిస్తే 10 శాతం పెంచనున్నారు. 

నరేంద్ర మోదీ సర్కార్ అధికారం చేపట్టిననాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తునే ఉన్నారు. 2017-18లో రూ.11.68 లక్షల కోట్ల మేర నిధులను వెచ్చించగా, అంతక్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతానికి పైగా పెంచారు. 2016-17లో రూ.9 లక్షల కోట్ల మేర కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ రూ.10.66 లక్షల కోట్లు ఖర్చుచేసింది. రోజు రోజుకు పెరుగుతున్న దేశ జనాభాకు తగ్గట్టుగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదన్న ఆయన..భారీగా నిధులు కేటాయించడంతో ఈ లక్ష్యానికి చేరుకోవడానికి సులభతరమవుతుందని చెప్పారు. 

సంస్థాగత రుణాలు అందించడం ద్వారా రైతులను ఆదుకోవాలనే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నదని, అలాగే తక్కువ వడ్డీకే సంస్థాగతేర రుణాలు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా వ్యవసాయ రుణాలపై 9 శాతం వార్షిక వడ్డీని వసూలు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి వడ్డీని మినహాయించే అవకాశం కూడా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఇది స్వల్పకాలం పాటు రైతులకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదం చేయనున్నదని, తద్వారా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగి అవకాశం ఉన్నది. 

రూ.3 లక్షల లోపు స్వల్పకాల రుణాలపై వార్షిక వడ్డీని 9 శాతానికి బదులు 7 శాతం వసూలు చేస్తున్నది కేంద్రం. అంటే రెండు శాతంమేర సబ్సిడీ ఇస్తున్నదన్న మాట. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మరో 3 శాతం అదనపు రాయితీని కూడా కల్పిస్తున్నది ప్రభుత్వం. ఈ వడ్డీరాయితీలు ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇస్తున్నాయి. 

వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో సంస్కరణలు, ప్రత్యక్ష పన్నులను మరింత హేతుబద్దీకరించే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక సంఘం పీహెచ్‌డీ చాంబర్ పేర్కొంది. గడిచిన ఐదుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లతో ప్రతి రంగంపై దృష్టి సారించిన కేంద్రం..ఈసారి సంస్కరణలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నదని ఒక ప్రకటనలో తెలిపింది. నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదే కావడం విశేషం.

 దీనిని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ప్రత్యక్ష పన్నులను హేతుబద్దీకరించడంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించాలని వ్యాపార దిగ్గజాలు కోరుతున్నాయి. అలాగే ఆదాయ పన్ను పరిమితిని రూ.3.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది రూ.25 లక్షలుగా ఉన్నది.