అమిత్ షాకు డిఎంకె ఆహ్వానంపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం

తమిళనాడులో ప్రస్తుతం కాంగ్రెస్ తో పొత్తులో కొనసాగుతున్న డిఎంకె ఈ నెల 30న జరుపుతున్న కరుణానిధి సంస్మరణ సభకు బిజెపి అద్యక్షుడు అమిత్ షాను ఆహ్వానించడం పట్ల కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బిజెపితో పొత్తుకు డిఎంకె ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దానితో తాము మరో దారి చూసుకో వలసిందే అంటూ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీకి స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడిఎంకే తో పొత్తు ఏర్పరచు కోవలసిందే అని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో డీఎంకే జోడు గుర్రాలపై స్వారీ చేస్తోందని, అదే తరహాలో కాంగ్రెస్‌ కూడా వ్యవహరిస్తూ అవసరమైతే అన్నాడీఎంకేతో కూడా పొత్తుకు సిద్ధంగా ఉండాలని చెబుతూ  రాహుల్‌గాంధీకి టీఎన్‌సీసీ సీనియర్‌ నేత ఒకరు లేఖ వ్రాసిన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. కరుణ స్మృత్యంజలి సభకు అఖిలపక్షాల ప్రాతిపదికన బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను ఆహ్వానించినట్టు డీఎంకే ఇస్తున్న వివరణను కొట్టి పారవేస్తున్నారు. అలాంటప్పుడు అధికార అన్నాడీఎంకేను మాత్రం ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తున్నారు.

కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అమిత్ షా ను డిఎంకె ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. పైగా, ఈ కార్యక్రమంలో అమిత్‌షా ప్రసంగం తర్వాతే కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను మాట్లాడించాలని నిర్ణయించడం ద్వారా బిజెపి తర్వాతి స్థానమే కాంగ్రెస్ కు అని స్పష్టమైన సంకేతాలు పంపిన్నట్లు అర్ధం అవుతున్నదని ఆరోపిస్తున్నారు. బిజెపితో తాము సన్నిహితంగా ఉన్నట్టు ఈ వేదిక ద్వారా బహిర్గతం చేయడానికి డీఎంకే తహతహలాడుతోందని విమర్శిస్తున్నారు.

అందువల్ల ఈ సభకు గులాం నబీ ఆజాద్‌ను పంపకుంటే మంచిదని, లేకపోతే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు మానసిక ఆవేదనకు గురికావచ్చని ఆ లేఖలో రాహుల్ గాంధీ ని ఆ సీనియర్ నేత వారించారు. వాజ్‌పేయీ కన్నుమూసిన నేపథ్యంలోనూ అన్నాడీఎంకే కన్నా బిజెపికి డిఎంకె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించి అసంతృప్తికి గురిచేసి పొత్తును విరమించుకోవాలని డీఎంకే చూస్తోందని ఆరోపిస్తున్నారు. తర్వాత బిజెపితో కూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉందని తెలిపారు. అందువల్ల ముందస్తు జాగ్రత్త కోసం డీఎంకే తరహాలోనే కాంగ్రెస్‌ కూడా జోడు గుర్రాలపై స్వారీ చేయాలని సూచించారు.

ఒక వంక రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతలలో ఉంచుకొనే ప్రయత్నం చేస్తూ, మరో వంక ఆ ప్రభుత్వాన్ని ఇక్కట్లకు గురిచేసేలా ఇప్పటికే ఐటీ సోదాలకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పేర్కొంటూ ఇదంతా డిఎంకెకు లబ్ది చేసేందుకే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ఎంపీ కేసీ పళనిస్వామిని కలిసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వాన్ని కలిసేందుకు నిరాకరించారని గుర్తు చేశారు.