రిసార్ట్ ఘర్షణలతో కాంగ్రెస్ ఎమ్యెల్యేకు గాయం !

కర్ణాటకలో మళ్లీ రిసార్ట్‌ రాజకీయాలకు దిగిన కాంగ్రెస్ ఎమ్యెల్యేల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కు తోచడం లేదు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఈగల్టన్‌ రిసార్ట్‌కు తరలించింది. ఆ రిసార్టులో శనివారం సాయంత్రం కొందరు ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ తలపై ఎమ్మెల్యే జేఎన్‌ గణేశ్ ఓ బాటిల్‌తో కొట్టడంతో ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు  మీడియా కధనాలు వెలువడ్డాయి.  ఆనంద్‌ సింగ్‌ చికిత్స తీసుకుంటున్న అపోలో ఆస్పత్రికి ఆదివారం ఉదయం కాంగ్రెస్‌ నేతలు క్యూ కట్టారు. ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకున్న ఆ పార్టీ నేత రఘునాథ్‌ మీడియాతో మాట్లాడుతూ తాము లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.  

ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత డీకే శివకుమార్‌ కొట్టిపారేశారు. అయితే, ఆయన సోదరుడు, కాంగ్రెస్ నేత డీకే సురేశ్‌ అదే ఆస్పత్రి వద్ద ఉన్నారు. కాంగ్రెస్‌ తీరుపై బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

‘కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులు దిగజారిపోయాయని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి? ఆ పార్టీ నేతలు ఈగల్టన్‌ రిసార్ట్‌లో ఘర్షణ పడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రిలో పాలయ్యారు. తమలో ఉన్న అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకెంత కాలం భాజపాపై ఆరోపణలు చేస్తుంది?’ అని ఆ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో విమర్శలు గుప్పించింది.

ఈ వార్తలపై స్పందించిన డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ఇది అసత్య వార్త. మా పార్టీ నేతలు ఐకమత్యంతో, కలిసిమెలసి ఉన్నారు’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 76 మంది ఎమ్మెల్యేలను శుక్రవారం రిసార్టుకి తరలించారు.