డ్రగ్స్‌ కేసు పై కేసీఆర్ ను నిలదీసిన రాజాసింగ్‌

గతంలో సంచలనం కలిగించిన మాదక ద్రవ్యాల(డ్రగ్స్‌) కేసు ఏమైందని, ఆ కేసు దర్యాప్తు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయిందని  బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును నిలదీశారు. రాష్ట్ర శాసన సభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలోపాల్గొంటూ ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులకు సంబంధం ఉన్నదని గతంలో చెప్పారని, పలువురు సినీ ప్రముఖులను విచారించారని, కానీ ఆ తర్వాత ఎవ్వరు ఏమీ మాట్లాడటం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

ఇప్పటికి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నదని అంటూ ఈ కేసులో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొంటుందో చెప్పాలని కోరారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నదని, కోట్ల రూపాయలలో బెట్టింగ్ జరుగుతున్నదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంగా ఈ బెట్టింగ్ వ్యాపారం నడుపుతున్నారని అంటూ వారిని కూడా అదుపు చేయాలని కోరారు.

ఉస్మానియా ఆస్పత్రి భవనం చాలా ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు హెల్మెట్లు పెట్టుకుని తిరిగే పరిస్థితి నెలకొని ఉందని రాజాసింగ్ తెలిపారు. వెంటనే ఈ ఆసుపత్రికి అత్యాధునిక భవనాలు సమకూర్చాలని కోరారు.  ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ సూచించారు. కంటి వెలుగు పథకం ఉద్దేశం మంచిదే కానీ ఇప్పటివరకు ఎంతమందికి శస్త్ర చికిత్సలు చేశారని ప్రశ్నించారు. 

నాటు సారాను కట్టడి చేయడంతో నిరాశ్రయులైన ధూల్‌పేట ప్రజలు ఇప్పుడు సర్వసం పోగొట్టుకొని దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోలన వ్యక్తం చేశారు. అక్కడకు వచ్చి, వారి పరిస్థితులు తెలుసుకొని, వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు అక్కడకు రాలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా వచ్చి వారి పునరావాసం గురించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.