కర్ణాటకలో అసలు విలన్ సిద్దరామయ్య !

కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలను కొనుగోలు చేసి అధికారంలో ఉన్న హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం బిజెపి కుట్రలు పన్నుతున్నట్లు కాంగ్రెస్ నేతలతో పాటు చంద్రబాబు నాయుడు వంటి నేతలు సహితం గగ్గోలు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా డబ్బు సంచులతో ఎమ్యెల్యేలను కొనుగోలు చేస్తున్నట్లు విష ప్రచారం చేస్తున్నారు.

ఈ ప్రభుత్వం తమ అంతర్గత వైరుధ్యాలతో అదే కూలి పోతుంది గాని దానిని కూలగొట్టడం కోసం బిజెపి ప్రత్యేకంగా ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి  బిఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం `ఆపరేషన్ కమల్' పేరుతో తమ ఎమ్యెల్యేలను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

ఈ మధ్య ముగ్గురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ముంబయికి వెడితే వారిని బిజెపి వారే తీసుకు వెళ్లారని ఆరోపించారు. కానీ వారంతా తనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారని మరోవంక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి చెబుతూనే ఉన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాల కారణంగా నలుగురు ఎమ్యెల్యేలు సీఎల్పీ సమావేశానికి రాలేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం బిజెపిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.

తనను సక్రమంగా పరిపాలన చేయనీయకుండా కాంగ్రెస్ నేతలు వత్తిడి తెస్తున్నారని ఈ మధ్య ముఖ్యమంత్రి కుమారస్వామి జెడి(ఎస్) ఎమ్యెల్యేల సమావేశంలో వాపోవడం చూసాము. ఆయన పేరు చెప్పక పోయినా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఉద్దేశించే వాఖ్యలు చేశారు. ఈ మధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో అంతా సిద్దరామయ్య మద్దతు దారులకు మాత్రమే మంత్రి పదవులు లభించడంతో కాంగ్రెస్ నేతలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఏడు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి వంటి వారిని సహితం పక్కన పెట్టడంతో అంతర్గతంగా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో జెడి(ఎస్)లో మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడకు కుడి భుజంగా పనిచేసిన సిద్దరామయ్య ఎప్పుడైతే దేవెగౌడ వారసుడిగా కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారో ఇక ఆ పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండదని గ్రహించి కాంగ్రెస్ లో చేరి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కాగలిగారు. అనూహ్యంగా పూర్తిగా ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు కూడా. అయితే ఇప్పుడు అదే కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేసి తాము మద్దతు ఇవ్వవలసి రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

కాంగ్రెస్ లో `ట్రబుల్ షూటర్'గా పేరొందిన మంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ కు ఎటువంటి సంక్షోభం ఎదురైనా పార్టీని ఆదుకొంటూ రాహుల్ గాంధీకి నమ్మకస్తుడిగా మారారు. అది సహించలేక శివకుమార్ మద్దతు దారులపై సహితం సిద్దరామయ్య అక్కసు ప్రదర్శిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కుమ్ములాటలే ఇప్పుడు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరత వైపు నెట్టుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

ఒక దశలతో ఈ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగితే కుమారస్వామి `అసమర్ధ పాలన' కారణంగా లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని సిద్దరామయ్య పార్టీ అధిష్టానం ఎదుట వాదించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటె లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందవచ్చని కూడా సూచించారు. అయితే రాహుల్ పాట్టించుకొలేదు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొడితే జాతీయ స్థాయిలో ఇతర పార్టీలు ఏవీ కాంగ్రెస్ ను నమ్మవని రాహుల్ హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

సిద్దరామయ్య కుత్రంత్రాల కారణంగా ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు `అసమ్మతి శిబిరం'లో చేరినట్లు తెలుస్తున్నది. తన ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం సిద్దరామయ్య కుతంత్రాలు చేస్తున్నారని గ్రహించిన కుమారస్వామి తన పదవి కాపాడుకోవడం కోసం కొంతమంది బిజెపి ఎమ్యెల్యేల సహకారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కుమారస్వామి ఎత్తుగడలను గ్రహించిన బిజెపి ముందు జాగ్రత్తకోసం తమ ఎమ్యెల్యేలను గురుగ్రాం రిసార్ట్ కు తరలించినట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా తనను నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం మనుగడ సాగించడం కష్టమనే స్పష్టమైన సంకేతాన్ని సిద్దరామయ్య ఇచ్చారు.

సహజంగానే అధికార కూటమిలోని లొసుగులను ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి అవకాశంగా మలచుకొని అవకాశం ఉంది. ఈ సందర్భంగా నెలాఖరు రోజులో జరిగే శాసనసభ సమావేశాలలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలవడంతో కాంగ్రెస్ లో మరింత ఖంగారు మొదలైనది.

సంకీర్ణ ప్రభుత్వం అస్థిరం చేసే కుట్ర వెనుక మాజీ సీఎం సిద్దరామయ్య హస్తం ఉందని,  ఈ ప్రక్రియకు ఆయనే సూత్రధారి అని కేంద్రమంత్రి సదానందగౌడ ఆరోపించారు. సీఎం కుమారస్వామి పనిచేసుకునేందుకు సిద్దరామయ్య అడ్డు తగులుతున్నారని తెలిపారు.  ఆయన అనుచరులే అంతర్గతంగా నిప్పు పెడుతున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జోక్యం చేసుకోలేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నగుబాట్లు కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. సిద్దరామయ్య చాముండేశ్వరిలో ఓడినప్పటి నుంచి పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో విశ్వాస తీర్మానం నెగ్గి 6 నెలలు పూర్తి అయింది. దీంతో మళ్ళీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. శాసనసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 104 మంది, కాంగ్రె్‌సకు స్పీకర్‌తో కలిపి 80మంది, ఇద్దరు ఇండిపెండెంట్‌లు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్‌లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాక సంకీర్ణ పాలకుల బలం 118కి పడిపోయింది. మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే బలం 114కు తగ్గిపోనుంది. ఇదే సమయంలో బీజేపీ బలం ఇద్దరు ఇండిపెండెంట్‌లతో కలపి 106కు పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కేవలం 8 మంది ఎమ్మెల్యేల బలం తేడా ఉంటుంది.