కర్ణాటకలో కొద్ది రోజుల్లో అగ్నిపర్వతం బద్దలు

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరచే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేస్తూనే  ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య తీవ్ర విభేదాలున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బి ఎస్ యెడ్యూరప్ప పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సీఎల్పీ భేటీకి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వచ్చే కొద్ది రోజుల్లో అగ్నిపర్వతం బద్దలవుతుందనేందుకు (ప్రభుత్వం కూలిపోతుందనేందుకు) ఇదే సంకేతమని చెప్పారు. 

అయితే  కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు ఎలాంటి భయాలు, అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన తెలిపారు.  గుర్గావ్‌లోని ఓ హోటల్‌లో ఉన్న 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బెంగళూరుకు తిరిగి రావాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటిస్తారని, అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కేవలం నిరాశ, నిస్పృహలతోనే గైర్హాజరైన ఎమ్మెల్యేలను బెదిరిస్తూ సిద్దరామయ్య వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదన్న యోడ్యూరప్ప నిర్ణయాన్ని మాజీ సీఎం సిద్దరామయ్య స్వాగతించారు.

కాగా, ప్రస్తుతం సంకీర్ణ సర్కారు ప్రమాదంలోనే ఉందని, అయితే, దీనిపై తానేమీ వ్యాకులత చెందడంలేదని సీఎం కుమారస్వామి కలకత్తాలో చెప్పారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గైర్హాజరు అంశం ఆ పార్టీ అంతర్గత విషయమని తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను నమ్ముకోవద్దని పలు సందర్భాల్లో కాంగ్రెస్‌కు చెప్పానని, వారిపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపలేమని పేర్కొన్నారు.

ఇలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దాచిన ఈగల్టన్ రిసార్టు నుంచి రూ.982 కోట్లు రికవరీ చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ డిమాండ్ చేసింది. 77 ఎకరాల ప్రభుత్వ భూమిని రిసార్టు యాజమాన్యం కబ్జా చేసినట్లు గతంలో జరిగిన దర్యాప్తులో తేలిందని పేర్కొన్నది. ఇందుకుగానూ రిసార్టుపై రూ.982 కోట్ల జరిమానా విధించారని, ఈ విషయాన్ని అసెంబ్లీలో రెవెన్యూమంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే స్వయంగా వెల్లడించారని బీజేపీ గుర్తుచేసింది. 

ఈ మొత్తాన్ని ఎప్పుడు వసూలు చేస్తారో చెప్పాలంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్, దినేశ్ గుండూరావులకు ప్రశ్నలు సంధించింది. జరిమానాను వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రంలో రైతుల రుణాలను మాఫీ చేసేందుకు వినియోగించాలని కోరింది.