బిజెపిలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి

కర్నూల్ జిల్లలో కీలక నేత ఒకరు బిజెపిలో చేరారు. పత్తికొండ నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీలో చేరారు. బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఆయన బీజేపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అమెరికాలో ఉన్నారు. ఆయన సూచన మేరకు ముఖ్య నాయకులు, అనుచరులతో కలసి హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో పురందరేశ్వరి సమక్షంలో బీజీపీలో చేరినట్లు కోట్ల హరిచక్రపాణిరెడ్డి తెలిపారు. కోట్ల కుటుంబానికి చెందిన హరి చక్రపాణి రెడ్డి భాజపాలో చేరడం శుభపరిణామని అంటూ ఆమె స్వాగతం పలికారు.  

 

2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. పత్తికొండ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్యకు గురి కావడంతో ఆయన సతీమణి కంగాటి శ్రీదేవికి పత్తిపాడు అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసారు.

దీంతో అసంతృప్తిగా ఉన్న కోట్ల చక్రపాణిరెడ్డి ఆ పార్టీకి దూరమయ్యారు. ఆరు నెలల క్రితమే దేవనకొండలో కార్యకర్తల సమావేశం నిర్వహించి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ అవినీతిరహిత సుపరిపాలన అందిస్తున్నారని అంటూ బిజెపి అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని స్పష్టం చేసారు. దీంతో బిజెపిపై సానుకూలభావంతో పార్టీలో చేరటానికి పలువురు నేతలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం రాష్ట్రానికి చేస్తోన్న సహాయాన్నిబిజెపి కార్యకర్తలే ప్రజల వద్దకు చేరవేయాలని పురంధేశ్వరి కోరారు. నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి నిబద్ధతో పని చేస్తానని హరిచక్రపాణి రెడ్డి తెలిపారు. తాను రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చెబుతూ చివరి శ్వాసవరకు బిజెపి కండువాతోనే ఉంటానని స్పష్టం చేసారు.