ప్రతిపక్షాల ర్యాలీ మోదీకి కాదు.. దేశానికి వ్యతిరేకులు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో కొలకత్తాలో ఒక వంక విపక్షాల ఐక్యతార్యాలీ జరుగుతుండగా అది తనకు వ్యతిరేకంగా జరుగుతున్నది కాదని, దేశ ప్రజలకు వ్యతిరేకం అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గుజరాత్ సరిహద్దు ప్రాంతం సిల్వస్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ విపక్షాల ర్యాలీ.. అది భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీ అని విమర్శించారు.

వాళ్ల ఐక్యత కూడా సరిగా లేదని దుయ్యబడుతూ వాళ్ల వాళ్ల వాటాల కోసం అప్పుడే భేరసారాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. తనకు, ప్రతిపక్షాలకు గల పెద్ద తేడాను ప్రస్తావిస్తూ తాను దేశం ప్రయోజనాలకోసం కృషి చేస్తూ ఉంటె వారంతా తమను కాపాడుకోవడం కోసం ఒక్కటి అవుతున్నారని మండిపడ్డారు.

అవినీతికి వ్యతిరేకంగా తాను చర్యలు తీసుకొంటూ ఉండడంతో కొంతమంది నాయకులూ కలవరం చెందుతున్నారని ప్రధాని చెప్పారు. వారు దేశాన్ని లూటీ చేస్తూ ఉండటాన్ని అరికడుతూ ఉంటె అడ్డుపడటంతో వారికి తనపై ఆగ్రహం కలగడం సహజమే అని పేర్కొన్నారు. అందుకేనా అటువంటి వారంతా `మహాఘటబంధన్' పేరుతో ఒక దగ్గరకు వస్తున్నారని విమర్శించారు.

రాష్త్ర శాసన సభలో బిజెపికి కేవలం ఒకే సభ్యుడు ఉన్న పశ్చిమ బెంగాల్ కు దేశం మొత్తం నుండి ప్రతిపక్ష నాయకులు తరలి వచ్చారని చెబుతూ ఒకే ఒక బిజెపి ఎమ్యెల్యే వారికి నిద్రపట్టని రాత్రులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. "మమ్ములను కాపాడండి.. మమ్ములను కాపాడండి" అంటూ వారు నినాదాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్ లో బిజెపి చేపట్టిన రధ్ యాత్రలను మమతా ప్రభుత్వం అడ్డుకొంటున్నదని చెబుతూ తమ సొంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తున్న నేతలు ప్రజాస్వామ్యం కాపాడతామంటూ నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.