శత్రుఘ్న సిన్హా అవకాశవాది

కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో విపక్షాలు చేపట్టిన ఐక్యతా ర్యాలీకి  బిజెపి ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకావడంపై బిజెపి నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిన్హా పేరు ప్రస్తావించకుండా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

‘కొంతమంది తెలివి వేరే విధంగా ఉంటుంది. కొంతమంది బిజెపి  స్టాంప్‌తో అధికారంలోకి వచ్చి అన్ని సౌకర్యాలు పొందుతారు. అందుకే అలాంటి వాళ్లు తమ సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అదే విధంగా వేదికలపైకి ఎక్కి సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశవాదుల్లాగా మారతారు. బిజెపి వారిని పరిగణనలోకి తీసుకుంటుంది’ అని రూడీ.. సిన్హాను హెచ్చరించారు.

మోదీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలి వల్లన తమకు వచ్చిన నష్టమేమీ లేదని భరోసా వ్యక్తం చేశారు.  ‘నరేంద్రమోదీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలు చూశారు. రానున్న ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘అసలు వాళ్ల నేత ఎవరు? ఇది కేవలం మోదీకి వ్యతిరేకంగా చేపట్టినది మాత్రమే. ఆ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు’ అని ఆయన విమర్శలు గుప్పించారు.

ఇలా ఉండగా, శత్రుఘ్న సిన్హా బీజేపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగించడం తగదని, పార్టీ వదిలి వెళ్ళాలి అనుకొంటే వెళ్లి పోవచ్చని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ గత వారం హితవు చెప్పడం తెలిసిందే.