యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు

ప్రజల ఆశీస్సులతో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం పయనిస్తోంది అని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతికి తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని తెలిపారు.

తెలంగాణ రెండో శాసనసభలో గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  2019 మార్చి నాటికి మిషన్ భగీరథ పథకం పూర్తవుతుంది. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నాం. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకం. పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు.

సాగుకు నిరంతర విద్యుత్‌తో రైతుల కష్టాలు తొలగినాయి. ఒకప్పుడు విద్యుత్ కోసం రాష్ట్రంలో ఉద్ధృతంగా ధర్నాలు జరిగేవి. 42 నెలల్లోనే 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్రాజెక్టు పూర్తి చేశాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో నేడు తెలంగాణ.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పెరుగుతున్న విద్యుత్ వినియోగం అభివృద్ధి సూచికగా నిలుస్తుంది. త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబడుతుంది. వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడా కరెంట్ అందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. 

రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం పట్ల హర్షం ప్రకటిస్తూ ఈ పథకాన్ని దేశంలోని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారని కొనియాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇవ్వబోతున్నామని ప్రకటించారు.

చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ధ్వంసమైన కులవృత్తులు మళ్లీ జీవనం పోసుకుంటున్నాయి. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ అవసరాల కోసం చేనేత కార్మికుల నుంచి భారీ ఎత్తున వస్ర్తాలు కొనుగోలు చేస్తున్నాం. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. గద్వాలలో కూడా టెక్స్‌టైల్ హబ్ నిర్మించే యోచనలో ఉన్నాం. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకులాలు ప్రారంభించామని వివరించారు.

ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. కేసీఆర్ కిట్‌లో శిశువు, తల్లి కోసం రూ. 2 వేల విలువ చేసే 16 రకాల వస్తువులు ఇస్తున్నాం. కంటి వెలుగు శిబిరాల్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పథకం కింద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశాం. త్వరలోనే ఈఎన్టీ శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలు సాకారం చేశామని పేర్కొన్నారు.

పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పాదర్శకత వల్ల రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే కొత్తగా 4 వేల పరిశ్రమలకు అనుతులు ఇచ్చాం. ప్రపంప ప్రఖ్యాతిగాంచిన ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. స్థలం ఉండి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేస్తామని ప్రకటించారు.