ఫైనల్స్ కు చేరి చరిత్ర సృష్టించిన పివి సింధు

ఆసియా క్రీడల్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీగా సింధు నిలిచింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన వారు లేరు.

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌కు ఇప్పటి వరకూ ఒకే ఒక్క సింగిల్స్‌ పతకం ఉంది. 1982లో దిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్‌ మోదీ కాంస్యం గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు.

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో తొలి సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో సెమీఫైనల్లో పీవీ సింధు ప్రపంచ నం.2 అకానె యమగూచి(జపాన్‌) పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. కోర్టు మొత్తం తిరుగుతూ ఇద్దరూ పాయింట్లు సాధించారు.

తొలి గేమ్‌ను సులువుగానే 21-17తో సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌ను 15-21తో చేజార్చుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు అద్భుతంగా పోరాడింది. ఎందుకంటే సింధు ఫిట్‌నెసే ఈ గేమ్‌ను గెలిపించిందని చెప్పొచ్చు. ప్రత్యర్థి యమగూచి అప్పటికే తన ఒంట్లో శక్తినంతా కోల్పోయింది. కానీ, సింధు ఏమాత్రం అలసిపోకుండా బలమైన షాట్లు కొడుతూ 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మంగళవారం స్వర్ణ పోరు జరగనుంది. ఈ పోరులో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ 12 సార్లు తలపడగా తై జు యింగ్ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించింది. రియో ఒలింపిక్స్‌లో తైజుని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.