ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాదు.. ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ కాదు.. ప్రత్యేక ప్రాధాన్యం (ట్రీట్‌మెంట్‌) ఇస్తూనే ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. కడపలో జరిగిన బీజేపీ సమావేశంలో ప్రసంగిస్తూ  విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పదేళ్లలో చూపాల్సిన ప్రగతిని నాలుగున్నరేళ్ల కాలంలోనే 80 శాతం  సాధించామని వెల్లడించారు. మరో ఒకటి రెండేళ్లలో నూరు శాతం సాధిస్తామని భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

‘‘నేను ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ఓ మాట చెప్పదలచుకున్నా.. గతంలో మేం చెప్పినట్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా కృషి చేస్తున్నాం. మేం చేస్తున్న కార్యక్రమాలకు గతంలో మీ ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ప్రత్యేకహోదా మంత్రం జపిస్తూ ఆయన మాకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వడం లేదు. దీంతో అవరోధం ఏర్పడుతోంది" అంటూ ధ్వజమెత్తారు.

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నందునే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గౌరవంలో దేశగౌరవం.. దేశగౌరవంలో ఆంధ్రప్రదేశ్‌ గౌరవం ఇమిడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లాల అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులను మంజూరు చేసిన మోదీ..ఆంద్ర ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌  చెప్పారు. పార్లమెంట్లో బలంగా ఉన్నా భాగస్వామ్య పార్టీలను తాము గౌరవిస్తున్నామని తెలిపారు.