కాంగ్రెస్‌తో కలిస్తే భూస్థాపితమే..చంద్రబాబుకు హెచ్చరిక

ఆంధ్రుల పక్షాన నిలిచి, కాంగ్రెస్‌ కుట్రలపై పోరాడిన ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడని పేర్కొంటూ కాంగ్రెస్‌తో కలిస్తే భూస్థాపితమేనని గుర్తు పెట్టుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సున్నితంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు.  కడపలో జరిగిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బిజెపి  శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జిల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటూ  ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నటిడిపి దెబ్బతినడాన్ని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరకు మునగాల్సిందేనని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. ఇప్పటివరకు జత కట్టిన ఏ పార్టీ బతికి బట్టకట్టలేదనితెలిపారు. పార్టీ కోసం తన జీవితాన్నే ధారపోసిన పీవీ నరసింహారావు పట్ల కాంగ్రెస్‌ దుష్ట వైఖరి అవలంభించిందని.. ఆయన పార్థివ దేహాన్నీ పార్టీ కార్యాలయంలోకి రానివ్వకుండా కుయుక్తి ప్రదర్శించిందని విమర్శించారు.

‘ఎన్టీఆర్ వర్థంతి రోజున కడపకు రావడం గర్వ కారణం. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్‌ వ్యతిరేకించారు. దేశ ఔన్యత్యాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ సిద్దాంతాలను పాటిస్తాం. దేశ ఔన్నత్యం కోసం పాటు పడిన వారి ఏ పార్టీకి చెందిన వారైనా బీజేపీ గౌరవిస్తుంది' అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

యాభై సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో మహిళల ఇళ్లల్లో దీపాలను వెలిగించలేకపోయారని చెబుతూ నాలుగున్నర ఏళ్లలోనే ఇంటింటికి విద్యుత్‌ సరఫరా అందించిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు. అవినీతి ప్రభుత్వాల, పాలకుల భరతం పట్టిన కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్‌ టెర్రరిస్టులను వాళ్ల భూ భాగంలోనే మట్టుబెట్టిందని పేర్కొన్నారు.

ఇద్దరు ఎంపీలతో ప్రారంభమై బీజేపీ మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెసేతర శక్తిగా ఎదిగి, నేడు  అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్ ఆరో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.  గ్రామీణ ప్రజల, అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను కేంద్రం అమలు చేసిందని వివరించారు.

భవిష్యత్‌లోనూ దేశ రక్షణ అంశంలో రాజీపడేదీ లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.