సులభతర వాణిజ్యంలో టాప్-50 ర్యాంకుల్లో భారత్

వచ్చే ఏడాది కల్లా సులభతర వాణిజ్యంలో ప్రపంచంలో టాప్-50 లోపు ర్యాంక్ లక్ష్యాన్ని చేరుకోవాలని కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. గత ఏడాది మనదేశం 75 స్థానాలు అధిగమించి ప్రపంచంలో 77వ ర్యాంకును సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఏడాదికి టాప్ 50 ర్యాంకింగ్స్‌లోకి చేరుకోవడానికి కష్టించి పనిచేయాలని తన టీమ్‌ను కోరాననీ, ప్రపంచంలో మరే దేశంతోనూ తీసిపోని విధంగా నిబంధనలు, అనుమతుల ప్రక్రియలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఉండాలనీ ఆయన చెప్పారు.

ఉజ్వల గుజరాత్ 9వ శిఖరాగ్ర సదస్సులో ప్రారంభ ఉపన్యాసంచేస్తూ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఇంతకాలం వృద్ధిచెందడానికి అడ్డుగా నిలిచిన ఆటంకాలన్నింటినీ తొలగిస్తున్నామనీ, సంస్కరణలు, డీరెగ్యులేషన్‌ల వేగం కొనసాగిస్తామని తెలిపారు. ‘ఇప్పటి వరకూ భారత్‌లో వృద్ధి, దేశాభివృద్ధికి ప్రతిబంధకాలుగా ఉన్న వాటిని మా ప్రభుత్వం క్రమానుగతంగా తొలగిస్తూ వస్తోంది. ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు సంస్కరణల వేగాన్ని పెంచుతోంది. జీఎస్టీ అమలు, పన్నుల సరళీకరణ వల్ల లావాదేవీల ఖర్చులు తగ్గాయి. సమర్ధమైన విధానం తెరమీదకు వచ్చింది’అని తెలిపారు

జీఎస్టీ అమలు, పన్నుల సరళీకరణతో లావాదేవీల వ్యయాలు తగ్గి వ్యాపార ప్రక్రియలన్ని సులభతరం అయ్యాయని పేర్కొన్నారు. డిజిటల్ ప్రాసెస్, ఆన్‌లైన్ లావాదేవీలతో వ్యాపారాలు వేగం గా చేయడానకి వీలైందని చెప్పారు.

వ్యాపారాన్ని మరింత స్మార్ట్‌గా నిర్వహించుకునే వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటిం చారు. దేశ పరిపాలన వ్యవస్థ గవర్నెన్స్‌ను మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నదని తెలిపారు. సంస్కరించుకు, నిరూపించు, పరిణతి చెందు మరింతగా సంస్కరించు అనే ఏకైక మంత్రంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నట్టు చెప్పారు.

‘ప్రభుత్వం పరిమాణాన్ని తగ్గించి పాలనా వ్యవస్థకు పదునుపెట్టడంపైనే మా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందుకు సంస్కరణలు, పనితీరు, పరివర్తనే మా ఆయుధాలు. ఎంతగా శ్రమిస్తే అంతగానూ ఉత్తమ ఫలితా లు సాధించగలమన్న నమ్మకం’అని అన్నా రు. గత నాలుగున్నర ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలోనూ గుణాత్మకమైన మార్పు లు ప్రస్పుటమవుతూ వచ్చాయని తమ ప్రభు త్వం వ్యవస్థాగత సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లిందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలతో పాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ ప్రభుత్వ విధానాలతో దేశంలోకి 263 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత నాలుగేండ్లలో వచ్చాయనీ, గత 18 ఏండ్లలో వచ్చి న మొత్తం ఎఫ్‌డీఐలలో ఇవి దాదాపు 45 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలో అనేక రంగాలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకున్నామనీ, దీంతో దేశ వృద్ధి రేటు గాడిలో పడిందని చెప్పారు. రహదారులు, ఓడ రేవులు, రేల్వేలు, విమానాశ్రయాలు, టెలికాం రంగాల్లో పెట్టుబడులు మరింతగా పెంచుతామని ఆ విధంగా నవభారత్ నిర్మాణానికి అవసరమైన ఊతాన్ని కల్పిస్తామని మోదీ స్పష్టం చేశారు.