కర్ణాటక కాంగ్రెస్ లో మళ్ళీ రిసార్ట్ రాజకీయాలు

కర్ణాటక కాంగ్రెస్ నేతలు మరోసారి ఆత్మరక్షణలో పడ్డారు. తమ పార్టీ ఎమ్యెల్యేలు అందరూ తమతోనే ఉన్నట్లు చెప్పుకొంటూ వచ్చిన నేతలు బలప్రదర్శనగా  శుక్రవారం జరిపిన శాసన సభ పక్ష  సమావేశానికి నలుగురు గైరాజరు కావడంతో ఆందోళన చెందుతున్నారు. దానితో ఖంగారు పడి ఎమ్మెల్యేలందరినీ గత రాత్రి బెంగళూర్‌లోని ఈగల్టన్ రిసార్ట్స్‌కు తరలించారు. సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు రమేష్‌ జర్కోలి, బీ నాగేంద్ర, మహేష్‌ కే, ఉమేష్‌ జాదవ్‌లు హాజరు కాలేదు. తాను అనారోగ్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేనని జాదవ్‌ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.

కాగా కోర్ట్ కేసు కారణంగా హాజరు కాలేక పోతున్నట్లు బి నాగేంద్ర ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కు ఫోన్ చేసి చెప్పారు. మిగిలిన ఇద్దరు ఎమ్యెల్యేల నుండి ఎటువంటి సమాచారం లేదు. గత నెల జరిగిన  మంత్రి పదవి  రమేష్ జర్కోలి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో కలసి ముగ్గురు ఎమ్యెల్యేలు కొద్దీ రోజులుగా ముంబయిలో ఉంటూ వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేల గైర్హాజరుపై సిద్దరామయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

సీఎల్పీ భేటీకి 80 మంది ఎమ్మెల్యేలకు గాను 76 మంది హాజరయ్యారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య వెల్లడించారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి హైకమాండ్‌ సూచలనకు అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు. సీఎల్పీ భేటీ అనంతరం సమావేశానికి హాజరైన 76 మందిని ప్రత్యేక బస్సుల్లో నగర శివార్లలోని ఈగల్టన్‌ గోల్ఫ్‌ రిసార్ట్స్‌కు తరలించారు.

‘ఆపరేషన్‌ కమలం కారణంగా మా ఎమ్మెల్యేలకు భద్రత కరవైంది. రానున్న లోక్‌సభ ఎన్నికలపై చర్చించే నిమిత్తం మేమంతా బెంగళూరు నగర శివార్లలోని రిసార్టులో సమావేశమవుతాం’ అంటూ తమ పార్టీలో అసంతృప్తికి కారణం బిజెపి అంటూ   సిద్ధరామయ్య ప్రకటించారు.

నలుగురు శాసన సభ్యులు దారి మళ్ళినా శాసన సభలో హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వానికి ఢోకా లేకపోయినా పరిస్థితులు సవ్యంగా లేవని ఆందోళన చెందుతున్నారు. మరో కొందరు సభ్యులు కూడా చేజారే అవకాశం ఉన్నదనే భయమఃతోనే వారందరిని రిసార్ట్ కు తరలించినట్లు భావిస్తున్నారు. 

అయితే ఒక కాంగ్రెస్ నేత కధనం ప్రకారం మొత్తం ఎనిమిది మంది ఎమ్యెల్యేలు బిజెపి నేతలకు అందుబాటులో ఉన్నారని, సంకీర్ణ ప్రభుత్వం  కూల్చివేతకు సిద్ధంగా ఉన్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా రిసార్ట్ కు తరలించామని చెప్పారు. ఎమ్యెల్యేలు, ఎంపిలు, మంత్రులం కలిసి ఒకేచోట ఉంటామని చెప్పారు.

  కాగా,ఎమ్మెల్యేల గైర్హాజరు అంశం కాంగ్రెస్ అంతర్గతమని, ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదని ముఖ్యమంత్రి సీఎం కుమారస్వామి భరోసా వ్యక్తం చేస్తున్నారు. 

ఇలా ఉండగా ఇద్దరు స్వతంత్ర సభ్యులు గత మంగళవారం సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొని బీజేపీకి మద్దతు తెలపడం తెలిసిందే. దానితో శాసనసభలో బిజెపి సభ్యుల సంఖ్య 106కు పెరిగింది. కాంగ్రెస్ కు 80, జెడి(ఎస్)కు 36 మంది ఉన్నారు. మొత్తం సభ్యుల సంఖ్యా 224. మరో ఏడుగురు ఎమ్యెల్యేల మద్దతు కూడదీసుకొంటే బీజేపీకి ప్రభుత్వం  ఏర్పడడానికి  వీలవుతుంది.