కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ దూరం !

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలసి పోటీ చేయబోతున్నాయని కధనాలు వెలువడిన రెండు వారల తర్వాత పొత్తు ప్రసక్తి లేదని ఇప్పుడు ఆప్ స్పష్టం చేసింది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా రెండు పార్టీల నేతల మధ్య సమాలోచనలు  జరుగుతున్నట్లు, ఢిల్లీలోని ఏడు సీట్లలో చేరి మూడు సీట్లలో పోటీ చేసి, మరో సీట్ ను తిరుగుబాటు బిజెపి నేత యశ్వంత్ సింగ్ కు వదలాలని అవగాహనకు వచ్చిన్నట్లు కూడా కధనాలు వెలువడ్డాయి.

అయితే ఈ కథనాలపై ఇప్పటి వరకు రెండు పార్టీల నేతలు మౌనంగానే ఉన్నారు. మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోవడం లేదని అంటూ ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ యూనిట్ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా పొత్తు పెట్టుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ బెట్టు చేస్తున్నట్లు గోపాల్ రాయ్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. 

"దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అనే విషాన్ని మింగేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, కాంగ్రెస్‌ ఇప్పటికీ అహంభావంతో ఉంది. అందుకే మేం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. దిల్లీ, పంజాబ్‌, హరియాణాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’ అని గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. త్వరలోనే లోక్‌సభలో పోటీ చేసే ఆప్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

అటు కాంగ్రెస్‌ కూడా ఆమ్ ఆద్మీతో పొత్తుకు అంతగా ఆసక్తి లెన్నట్లు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే కాంగ్రెస్‌ పార్టీ దిల్లీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షీలా దీక్షిత్‌ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విషయమై ఆమ్‌ ఆద్మీ పార్టీతో చర్చించలేదని స్పష్టం చేశారు. రాజకీయాలంటేనే సవాళ్లనీ, తమకు భాజపా-ఆమ్‌ఆద్మీ పార్టీ ఒక సవాల్‌ అని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కొంటామని చెప్పారు.