ఎన్నికల సంస్కరణలపై ఈసి కీలక భేటి !

దేశం సాధారణ ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో పలు ఎన్నికల సంస్కర ణలపై ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలతో సోమవారం కీలక భేటి జరుపుతున్నది. గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలను, 51 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్‌ ఈ భేటికి ఆహ్వానించింది. రాజకీయ పార్టీలకు అందచేసిన అజెండాలో ప్రాక్సీ ఓటింగ్‌ ( ఒకరి తరపున మరొకరు ఓటు వేయడం) విధానాన్ని తెరపైకి తెచ్చింది. ' దేశీయంగా వలసవెళ్లే వారు. వివిధ కారణాలతో ఓటింగ్‌కు దూరమయ్యే వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు' అని ఇసి అజెండాలో పేర్కొంది.

మరింత పారదర్శకంగా ఓటర్ల జాబితా నిర్వహణ, చట్టసభల్లో, రాజకీయ పార్టీల్లో సంస్థాగతంగా మహిళా రిజర్వేషన్ల అమలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయంపై నియంత్రణ, పార్టీల ఖర్చులకు పరిమితులు విధించడం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో అభిప్రాయాలు స్వీకరించనుంది.

రాజకీయ పార్టీలకు పంపిన అజెండాలో సోషల్‌మీడియా నియంత్రణపై ఎన్నికల కమిషన్‌ ప్రధానంగా దృష్టి సారించింది. పోలింగ్‌ ప్రక్రియకు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తున్నప్పటికీ, సోషల్‌ మీడియాలో ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఎలా నియంత్రించాలన్న విషయమై రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తామని, ఆ దిశలో కఠిన నిబంధనలు రూపొందించే అవకాశం ఉందని ఇసి వర్గాలు తెలిపాయి.

ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వగా, ఎన్నికల కమిషన్‌ తాజా సమావేశంలో ఎన్నికల సమయంలో పార్టీల ఖర్చుకు పరిమితి విధించాలన్న ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు అభ్యర్థి చేసే ఖర్చుకు మాత్రమే పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. పార్టీలు నిర్వహించే సభలను, మీడియాకు ఇచ్చే ప్రకటనలను ఈ ఖర్చులో కలపడం లేదు. ఇది దుర్వినియోగమవతోందని ఇసి భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల ఖర్చుకూ పరిమితి విధించాలని భావిస్తోంది.

మహిళల ప్రాతినిధ్యం పై చట్టసభలతో పాటు, ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెంచే అంశాన్ని కూడా ఇసి తన అజెండాలో చేర్చింది. 16వ లోక్‌సభలో 11.4శాతం మాత్రమే మహిళల ప్రాతినిధ్యం ఉండగా, ప్రపంచ సగలు 22.9శాతం ఉంది. ఉప ఎన్నికల్లో అనుసరిస్తున్న విధానాలు, చేయాల్సిన మార్పులు, ఎన్నికల విశ్వసనీయత, ఎంఎల్‌సి ఎన్నికలు, ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం, వికలాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, జాతీయ ఎన్నికల క్విజ్‌ యాప్‌ తదితర అంశాలను కూడా ఇసి అజెండాలో చేర్చింది.