వేడెక్కిన రాజకీయం.. విదేశీ పర్యటనలు రద్దుచేసుకున్న బాబు, జగన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఒకేసారి ప్రధాన రాజకీయ పార్టీలలో ఎన్నికల జ్వరం ప్రవేశించింది. సంక్రాతి ముగియగానే ఎన్నికల ఎత్తుగడలతో నిమగ్నమవడం ప్రారంభించారు. అందుకోసం ముందుగా అనుకున్న విదేశీ పర్యటనలను సహితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. శరవేగంగా మారతున్న రాజకీయ పరిణామాలు ఎటువంటి మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన అగ్రనేతల్లో కనిపిస్తున్నది.

ఏపీ పట్ల వ్యతిరేక సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణలో అధికారాన్ని కాపాడుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అనూహ్యంగా కుమారుడు కె టి రామారావును ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పంపి తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని ఆహ్వానించడం, జగన్ ను కలవడం కోసం తానే స్వయంగా ఏపీకి వీడతానని చెప్పడం, ఈ సమావేశంపై తెలుగు దేశం పార్టీ నేతలు అగ్గిమీద గుగ్గిలం కావడం, ఆ మరుసటి రోజుననే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ ఆకస్మికంగా బదిలీ కావడం అన్ని చక చక జరిగిపోతున్నాయి.

మరోవంక రాయలసీమలో పర్యటించ వలసిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అనారోగ్యంతో  రాలేక పోయినా హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ ను పంపడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బస్సు యాత్రను ప్రారంభించ బోవడం చేస్తున్నారు. విజయవాడలో జిల్లాలవారి సమీక్షలు పూర్తి చేసుకున్న జనసేన నేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోయే ముందు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.

దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులకు క్రమం తప్పకుండ వెడుతున్న చంద్రబాబు నాయుడు తన పర్యటన కాలాన్ని కుదించుకోమని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ చెప్పడంతో సహనం కోల్పోయి, ఇప్పుడు అసలు పర్యటన రద్దు చేసుకొని కుమారుడు లోకేష్ ను పంపుతున్నారు. చివరకు తనతో పాటు బయలుదేరిన సీనియర్ మంత్రు యనమల రామకృష్ణుడు పర్యటనను సహితం నిలిపివేశారు. పాదయాత్ర ముగించుకున్న జగన్ విశ్రాంతి కోసం, చదువుకొంటున్న కుమార్తెతో కొంత సమయం గడపటం కోసం ఐదు రోజుల పర్యటనకు లండన్ కు బయలు దేర వలసి ఉండగా ఆగిపోయారు.

అందుబాటులో ఉన్న మంత్రులతో జరిపిన అత్యవసర సమావేశం అనంతరం చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్, కేసీఆర్ కలయికతో చంద్రబాబు కలవరం చెందుతున్నట్లు ఆయన మాటల ధోరణి వెల్లడి చేస్తున్నది. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలోని రాజకీయ నాయకులు కొంతమేరకు ఆందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది.