జీఎస్టి రిటర్నుల ఆధారంగా బ్యాంకు రుణాలు

వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) రిటర్నుల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా కొత్త విధానం ప్రవేశపెట్టనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ప్రధాని గాంధీనగర్‌లో ‘విశ్వ వ్యాపార ప్రదర్శన’ను ప్రారంభిస్తూ ‘‘నూతన విధానం వైపు దేశం పయనిస్తోంది. బ్యాంకులు కేవలం జీఎస్టీ రిటర్నుల ఆధారంగానే రుణాలు ఇచ్చే విధానం రానుంది. పరోక్ష పన్నుల విధానాన్ని క్రమబద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.

తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో కోట్లాది ఉద్యోగ అవకాశాల కల్పనకు సహకరించిందని ప్రధాని తెలిపారు. ‘‘పర్యాటక రంగంలో కానీయండి, సేవా రంగంలో కానీయండి..కోట్లాది ఉద్యోగ అవకాశాలను కల్పించాం’’ అని చెప్పారు. చిన్న వ్యాపారులు ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ‘జెమ్‌’ (గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌)ను ప్రారంభించామని, దీని ద్వారా ఇంతవరకు రూ.16,500 కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు.

ఈ ప్రదర్శనలో ఖాదీ, ఇస్రో, డీఆర్‌డీఏ వంటి సంస్థలు ‘భారత్‌లో తయారీ’లో భాగంగా తాము రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించాయి. వీటన్నింటినీ ప్రధాని సందర్శించారు. తొలిసారిగా ఆఫ్రికా దేశాలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి బృందమూ రాలేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా పెవిలియన్లు ఏర్పాటు చేశారు.

దాదాపు 1,500 మంది ప్రముఖ స్వదేశీ, విదేశీ వ్యాపారులు రానుండడంతో వారికి ఈ ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. వారితో సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.