రాజకీయ సంకల్పంతోనే 10 శాతం రిజర్వేషన్లు

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాల్లో కల్పించేందుకు నిర్దేశించిన బిల్లుకు రాజ్యాంగ సవరణను రాజకీయ సంకల్పం వల్లనే సాధ్యమైందని ప్రధాన మంత్రి తెలిపారు. బలమైన రాజకీయ సంకల్పం వల్లనే ఇంతటి గొప్ప బిల్లును పార్లమెంటులో ఆమోదించుకున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణతో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని పేర్కొన్నారు.

రూ.750 కోట్లతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1500 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తూ  ప్రస్తుతం అమలులో ఉన్న సామాజిక వర్గాల రిజర్వేషన్లకు విఘాతం కలగకుండా ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పించామని చెప్పారు.  ఈబీసీ రిజర్వేషన్లను ఈ ఏడాది దేశంలో 900 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 40వేల కాలేజీల్లో అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే సీట్లను పదిశాతం పెంచుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు సమానంగా రిజర్వేషన్ల ఫలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆసుపత్రిలో ఆరోగ్యబీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. వంద రోజుల్లో దేశంలో ఏడు లక్షల మందికి ఆరోగ్య బీమా ఫలాలను అందించినట్లు చెప్పారు. హెలిపాడ్ సదుపాయం ఉన్న తొలి ఆసుపత్రి ఇదేనని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రత, హెల్త్‌కేర్ అనే రెండు లక్ష్యాలతో అహ్మదాబాద్ నగరపాలక సంస్థ మొదటి నుంచి పనిచేస్తోందని ప్రశంసించారు. 2012 లో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు.

గతంలోని రిజర్వేషన్ల విధానాలు సామాజిక అశాంతిని నింపితే తమ విధానం వల్ల సామాజిక సామరస్యం నెలకొంటుందని పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. అభివృద్ధి పరుగులో ఎవరూ వెనుకబడకూడదన్నదే లక్ష్యమని వివరించారు.