ఇష్టం లేకనే హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయలేదు

ఇష్టం లేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయలేదని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  సీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలని బీజేపీ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిందని అయన చెప్పారు.  హైకోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చిందని చెబుతూ రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని మండిపడ్డారు.

ఏపీ అభివృద్ధికి లక్షల కోట్ల నిధులు కేంద్రం మంజూరుచేసిందని చెబుతూ అయినా
ముఖ్యమంత్రి మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఆబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొమ్మొఒకరిది సోకొకరిది అన్న చందనంగా నిధులు కేంద్రం ఇస్తే చంద్రబాబు వాటిని జల్సాలకు వినియోగించారని ఆగ్రహం వ్యక్తం చేయసారు.  చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నిధుల గురించి ప్రజలకు వివరించాలని కన్నా సవాల్ చేశారు.

ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం సూచనలను బాబు అస్సలు లెక్కచేయడం లేదని, ఆయన ఒక డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాయని, దీంతో చంద్రబాబు పూర్తిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి దొంగ దీక్షలు చేయించి హడావుడిగా శంకుస్థాపన జరిపారని ధ్వజమెత్తారు. విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ వాటి నిర్మాణం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుతోపాటు రాష్ట్ర అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.