తెలంగాణ శాసనసభాపతిగా పోచారం

తెలంగాణ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే , మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. ఆయన గురువారం నామినేషన్‌ దాఖలుచేశారు. ప్రతిపక్ష నేతలను ఫోన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బుధవారం సంప్రదించి మద్దతు కోరడంతో వారెవ్వరూ పోటీ చేయడం లేదు. దానితో ఆయన ఎన్నిక లాంఛనం కానున్నది.

అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. స్పీకర్‌గా పోచారంకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో శాసనసభపతిగా పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

గురువారం ఉదయం పోచారం పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పీకర్‌ ఎన్నికకు మద్దతు తెలపడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీనిపై చర్చించడానికి ఉదయం అసెంబ్లీలో కేసీఆర్‌తో పోచారం భేటీ అయ్యారు. 

బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్‌ శాసనసభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాస్‌రెడ్డి వైపు కేసీఆర్‌ మొగ్గు చూపారు.

గతంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పంచాయత్ రాజ్ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్‌ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు.

ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన పోచారం వయస్సు, ఆరోగ్యపరమైన సమస్యలను సీఎం దృష్టికి తెచ్చినా.. వాటిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చేందుకు కూడా సీఎం నుంచి హామీ లభించినట్లు చెబుతున్నారు.