కాళేశ్వరంపై విచారణకు అఖిలపక్షం డిమాండ్

వేల కోట్ల రూపాయల ప్రజాధనం, విలువైన సమయం వృధా అయిందంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన విషయాలన్ని ప్రజలకు తెలిసేలా సమగ్ర విచారణ జరిపించాలని  అఖిలపక్షం డిమాండ్ చేసింది. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ రఘు అధ్యక్షతన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీ-ఇంజనీరింగ్‌పై జరిగిన చర్చ గోష్టిలో కేవలం నీటి లభ్యత కారణంగా చూపి తప్పుడు లెక్కల ఆధారంగా ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మార్చేందుకు డీపీఆర్‌లో ప్రతిపాదించారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నేర పూరిత కుట్రకు పాల్పడిందని ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపు డీపీఆర్ ను తయారు చేశారని, నీటి లభ్యత విషయంలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నీటి లభ్యత ఉన్న చోట లేనట్టు, నీటి లభ్యత లేని చోట ఉన్నట్లు చూపించారని అంటూ మేడిగడ్డ వద్ద 415 టీఎంసీల నీటి లభ్యత ఉందని బ్యాంకుల నుంచి రూ.80 వేల కోట్ల పైగా రుణాలు తీసుకోవడాన్ని ఎవ్వరూ అంగీకరించే పరిస్థితిలో లేరని స్పష్టం చేసారు.

ఐదుగురు ఇంజనీర్లు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వద్దని ప్రభుత్వానికి సూచించినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని ద్వజమెత్తారు. ఒక టీఎంసీతో 18 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని చెప్పడమంటే మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. సాధ్యం కాని ప్రాజెక్టు కోసం తక్కువ సమయంలో అధిక వడ్డీకి బ్యాంకు రుణం పొందడం, ప్రాజెక్టు వ్యయాన్ని రెండింతలు, మూడింతలు పెంచారని అంటూ  ప్రపంచంలో ఇంత అధిక వడ్డీకి బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఎవ్వరూ ప్రాజెక్టులు కట్టలేదని స్పష్టం చేసారు. దీనితో పాటు ప్రాజెక్టు నిర్వహణ కోసం ఉపయోగించే విద్యుత్ ఖర్చును కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు.  

మహారాష్ట్రతో 148 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను సమాధి చేశారని తాము విమర్శిస్తే జైళ్లో పెడతామని కేసీఆర్ బెదిరించారని గుర్తు చేసారు. 148 మీటర్లకు ఒప్పుకోవడం టీఆర్‌ఎస్ నేతల పెద్ద తప్పే అని అంటూ 152 మీటర్లకు అంగీకరిస్తే మహారాష్ట్రలో కొన్ని వేల గ్రామాలు ముంపుకు గురౌతాయని మహారాష్ట్ర వెనుకడుగు వేస్తే, లక్షల ఎకరాల ముంపునకు గురౌతాయని తెలిసి కూడా కేసీఆర్ 148 మీటర్లకు అంగీకరించారని అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాని ప్రాజెక్టు అని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాల కన్నా భారీ నష్టాలే ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర బిజెపి అద్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. డీపీఆర్‌లో తప్పుడు లెక్కలు చూపించారని అంటూ సీనియర్ ఇంజనీర్లుగా ఉన్న వారు తప్పుడు లెక్కలు ఇస్తామంటే ఎలా అని, అంతకు ముందు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రతినిధి శ్యాంప్రసాద్ రెడ్డి డీపీఆర్‌లో లెక్కలంటే రాజకీయ నాయకులు ఎన్నికల తర్వాత సమర్పించే ఖర్చుల వంటివి అని చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రశ్నించారు.

తాము సిఫారసు చేసినా ప్రభుత్వం ఆమోదించడం లేదని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పడం కాదని, ఎందుకు ఆమోదించడం లేదో ప్రశ్నించాలని ఆయన సూచించారు. మౌనంగా ఉండడం తగదన్నారు. ప్రాజెక్టులు ప్రజలందరివని, పాలకులు ప్రజా ప్రయోజనాలను కాదని వెళ్తుంటే ఆపాల్సిన బాధ్యత అందరిపై ఉందని హితవు చెప్పారు. ప్రశ్నించినప్పుడే రిటైర్డ్ ఇంజనీర్ల విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొన్నారు.

తుమ్మడిహట్టి వద్ద ఉన్న నీటి లభ్యతను పూర్తిగా వాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల పూర్తి అవసరాలను తీర్చలేదని అంటూ ఇచ్చంపల్లి, కాంతనపల్లి తదితర ప్రాజెక్టులు కట్టుకుంటూ తెలంగాణ ప్రజల పూర్తి అవసరాలను తీర్చాలని కోరారు. రీడిజైన్ తప్పుగా చేశారని సెహ్బుటు ఆదిలాబాద్‌లో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా ఆదిలాబాద్‌కు చుక్క నీరు వచ్చే అవకాశం లేదని విస్మయం వ్యక్తం చేసారు. వరంగల్‌కు, సూర్యాపేటలకు కూడా ప్రయోజనం లేకుండా  ప్రభుత్వం పెద్ద మోసానికి పాల్పడిందని ద్వజమెత్తారు.  

కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్, రీడిజైన్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట టిడిపి అద్యక్షులు ఎల్.రమణ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పాలకులు తమ అనుయాయులకు దోచిపెట్టేందుకే ప్రాధాన్యత ఇచ్చారని అంటూ తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అంగీకరించడమంటే తెలంగాణకు మరణశాసనమని స్పష్టం చేసారు. రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టడమంటే ప్రజలపై భారం మోపడమేనని తెలిపారు.