బెంగాల్‌లో 20 నుంచి బీజేపీ మహార్యాలీలు

పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 20 వ తేదీ నుంచి బీజేపీ మూడు రోజుల పాటు మహా ర్యాలీలను నిర్వహించనుంది. ఈ వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే. 

కాగా ఈ నెల 19వ తేదీన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మహా ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి దేశంలోని వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరించాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, మాల్డాలో 20వ తేదీన మొదటి ర్యాలీని అమిత్ షా ప్రారంభిస్తారు. 21వ తేదీన బ్రిబూమ్, జాగ్రామ్, 22వ తేదీన కృష్ణనగర్ పట్టణంలో, జయానగర్ ర్యాలీల్లో అమిత్‌షా పాల్గొంటారు. 

త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నాలరు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ విస్తరిస్తోంది. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో పోల్చితే తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ రథయాత్రను చేపట్టాలని ముందు నిర్ణయించింది. కాని న్యాయపరమైన చిక్కుల్లో పడింది. దీంతో కోర్టు ఆదేశం మేరకు ర్యాలీలను నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. 

రథయాత్రను తప్పనిసరిగా చేపట్టితీరుతామని, ఈ అంశంపై వెనక్కు వెళ్లే ప్రసక్తిలేదన్నారు. 40 రోజుల రథయాత్రను 20 రోజులకు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. ముషీరాబాద్ జిల్లా నుంచి రథయాత్రను ప్రారంభిస్తామన్నారు