వైద్య పరీక్షల కోసం అమెరికాకు జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వైద్య పరీక్షల కోసం గత ఆదివారం రాత్రి అమెరికా వెళ్లారు. వారాంతంలో ఆయన తిరిగి స్వదేశానికి చేరుకుంటారని తెలుస్తోంది. దిల్లీలోని ఎయిమ్స్‌లో గత ఏడాది జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత అక్కడే పలుమార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు

ఇప్పుడు మాత్రం వైద్య పరీక్షల కోసం అనూహ్యంగా అమెరికా వెళ్లారు. కాగా, ఆయన ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ను పార్లమెంట్  సమర్పించ వలసి ఉంది. ఈ లోగానే ఆయన తిరిగి రాగలరని భావిస్తున్నారు.  

జైట్లీ అమెరికా వెళ్లడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ట్విటర్‌లో స్పందించారు. జైట్లీ ఆరోగ్యం బాగాలేదని తెలిసి తాను కలత చెందానని పేర్కొన్నారు.  ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో జైట్లీకి, ఆయన కుటుంబానికి 100 శాతం అండగా ఉంటామని తెలిపారు.

అమిత్‌ షాకు  స్వైన్‌ ఫ్లూ

ఇలా  ఉండగా,స్వైన్‌ ఫ్లూ చికిత్స కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ‘నాకు స్వైన్‌ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి దయ, మీ అందరి ఆశీర్వాందంతో త్వరలోనే కోలుకుంటా’ అని అమిత్‌ షా హిందీ భాషలో ట్వీట్‌ చేశారు. ఛాతీ పట్టేయడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర కారణాలతో అమిత్‌ షాను ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అమిత్‌ షాను ఆసుపత్రిలో పరామర్శించారు.