ఎగ్జిమ్ బ్యాంక్ కు రూ.6,000 కోట్ల మూలధనం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ ఎగుమతి-దిగుమతి బ్యాంక్ (ఎగ్జిమ్ బ్యాంక్)కు రూ.6,000 కోట్ల మూలధన సాయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ.6,000 కోట్ల మూలధన సాయం నిమిత్తం ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయనున్నది అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) రూ.4,500 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20) రూ.1,500 కోట్లు సమకూర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

దీంతో ఈ ఏడాది మార్చి 31లోగా తొలి విడుత రూ.4,500 కోట్ల సాయం బ్యాంక్‌కు అందనున్నది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తామని వివరించారు. అలాగే బ్యాంక్ ఆథరైజ్డ్ క్యాపిటల్‌నూ రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. 1982లో ఎగ్జిమ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా, భారతీయ అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహానికి ఇది దోహదం చేస్తున్నది.

అస్సాంలోని నుమలిగఢ్ రిఫైనరీ విస్తరణకూ కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఇక్కడ ఏటా 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు శుద్ధి జరుగుతున్నది. దీన్ని 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు. ఇందుకు రూ.22,594 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అన్ని అనుమతులు వస్తే.. 48 నెలల్లో ఈ ప్రాజెక్టు విస్తరణ పనులు ముగిసే వీలుందని గోయల్ చెప్పారు. పారదీప్ నుంచి నుమలిగఢ్‌కు క్రూడాయిల్ పైప్‌లైన్‌ను, నుమలిగఢ్ నుంచి సిలిగురికి ప్రోడక్ట్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.గనుల భద్రతపై భారత్-ఆస్ట్రేలియా మధ్య మెమరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంవోయూ)కూ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈ ఒప్పందంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, సేఫ్టీ ఇన్ మైన్స్, టెస్టింగ్ అండ్ రీసెర్చ్ స్టేషన్ మధ్య రిస్క్ బేస్డ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అమలుకు చక్కని భాగస్వామ్యం కుదురగలదని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా, ఈ ఒప్పందం మూడేండ్లపాటు అమల్లో ఉంటుందని గోయల్ ఈ సందర్భంగా తెలియజేశారు.భుత్వ రంగ హైడ్రో పవర్ సంస్థలైన ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఈఈపీసీవో, టీహెచ్‌డీసీ ఇండియా, ఎస్‌జేవీఎన్‌ఎల్ ఉద్యోగుల వేతన చెల్లింపులను క్రమబద్ధీకరిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో 5,254 మందికి ప్రయోజనం చేకూరనుండగా, ఖజానాపై రూ.323 కోట్ల భారం పడనున్నది.

ఇదిలా ఉంటే 13 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం రూ.3,600 కోట్ల వ్యయానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాతి తరం ఆదాయం పన్ను (ఐటీ) దాఖలు వ్యవస్థకు క్యాబినెట్ లైన్‌క్లియర్ చేసింది. దేశీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థయైన ఇన్ఫోసిస్‌కు ఈ వ్యవస్థ అభివృద్ధి బాధ్యతలను అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.4,241.97 కోట్లు. ఐటీ రిటర్న్ ఫైలింగ్స్ ప్రాసెసింగ్ కోసం ఈ తర్వాతి తరం వ్యవస్థను అమల్లోకి తేనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిఫండ్లు వేగవంతం అవుతాయని, ఐటీఆర్ ప్రాసెసింగ్ సమయం గణనీయంగా ఒక్క రోజుకు తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుతం 63 రోజులు పడుతున్నట్లు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలిపారు.