మాయావతి రాజకీయ వారసుడిగా మేనల్లుడు!

బిజెపి, వామపక్షాలు మినహా మిగిలిన అన్ని పార్టీలలో దాదాపుగా కుటుంభ సభ్యులకే రాజకీయ వారసత్వం లభిస్తున్నది. అవివాహితులైన మాయావతి, మమతా బెనర్జీ వంటి వారు సారధ్యం వహిస్తున్న పార్టీలలో కూడా బంధువుల ప్రాబల్యం తప్పడం లేదు. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆమెకు వారసుడిగా ప్రచారం జరుగుతూ ఉండగా, తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి వారసుడిగా కూడా ఆమె మేనల్లుడు రంగ ప్రవేశం చేయబోతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.

మాయావతి మంగళవారం తన 63 జన్మదిన వేడుకలను జరుపుకున్న నేపథ్యంలో ఆమె రాజకీయ వారసుడికి సంబంధించిన ఊహాగానాలు ఊపందుకున్నాయి. అధినేత్రి పుట్టినరోజు వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు హాజరైనప్పటికీ మాయావతి వెంటనే ఉన్న ఒక యువకుడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు.

నీలం రంగు సూటు వేసుకుని బిఎస్‌పి అధినేత్రి వెన్నంటే ఉన్న ఆ యువకుడు మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడు ఆకాశ్ కుమార్ అని తెలిసింది. పార్టీ వర్గాల కథనం ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ కుమార్‌ను రంగంలోకి దించి పార్టీ యువజన విభాగ సారథ్య బాధ్యతలను అతనికి అప్పగించాలని మాయావతి యోచిస్తున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అకాశ్ నుంచి మాయావతి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని, సోషల్ మీడియా వ్యూహాలను అతనే రచిస్తున్నాడని, ప్రస్తుతం బిఎస్‌పి సోషల్ మీడియాను నడిపిస్తున్న ఆకాశ్ మాత్రం ఎన్నడూ తెర ముందుకు రాలేదు.  వారం రోజులుగానే ప్రముఖంగా కనిపిస్తున్నారు. అఖిలేష్ తో కలసి మాయావతి మీడియా సమావేశం జరిపినప్పుడు, ఆర్ జె డి నేత తేజస్వి యాదవ్ వచ్చి కలసినప్పుడు కూడ ఆమె వెంటనే ఉన్నారు. లండన్‌లో ఉన్నత చదువులు చదివి ఇండియాకు తిరిగి వచ్చిన ఆకాశ్‌ను ఆమె  తన రాజకీయ వారసుడిగా ఆమె ప్రకటించే రోజులు ఎంతో దూరం లేవని వినపిస్తోంది.