రూపాయి పతనంతో ముప్పేమీ లేదు !

రూపాయి విలువ పతనం వల్ల వచ్చే ముప్పేమీ లేదని, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగా ఉన్నాయని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా అన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ నెల 16న మునుపెన్నడూ లేనివిధంగా జీవితకాల కనిష్ఠాన్ని తాకుతూ 70.32 స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 69.91 వద్ద కదలాడుతున్నది. ఈ క్రమంలో రూపాయి విలువ క్షీణతపై ఆందోళన అక్కర్లేదని, నిజానికి గడిచిన కొన్నేండ్లలో రూపాయి నిజ మారకపు రేటు చాలాచాలానే పెరిగిందని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పనగరియా చెప్పారు.

అంతేగాక రూపాయి విలువ అధికంగా ఉంటే.. అది దేశీయ ఎగుమతులను ప్రభావితం చేస్తుందన్నారు. కాగా, ముందు జాగ్రత్తతో కావాల్సినన్ని డాలర్ నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించడంపట్ల ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆర్బీఐ చర్యలు ఆపత్కాలంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) మూడు లేదా నాలుగో త్రైమాసికంలో దేశ జీడీపి 8 శాతాన్ని అధిగమించవచ్చన్న విశ్వాసాన్నీ పనగరియా వ్యక్తం చేశారు.

అంతేగాక మరో పదేండ్ల కంటే తక్కువ వ్యవధిలోనే బ్రిటన్, జర్మనీ, జపాన్‌లను భారత ఆర్థిక వ్యవస్థ మించిపోతుందని, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదన్న అంచనాను వెలిబుచ్చారు. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలున్న క్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని వృద్ధిదాయక నిర్ణయాలు తీసుకునే వీలుందా? అన్న ప్రశ్నకు పనగరియా బదులిస్తూ దేశ ఆర్థిక ప్రగతికి మోదీ కట్టుబడి ఉన్నారని తాను గట్టిగా చెప్పగలను అన్నారు. చిన్నచిన్న రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తునే మోదీ తాకట్టు పెట్టబోరన్న విశ్వాసాన్ని కనబరిచారు.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2017-18) దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కొద్దిగానే పెరిగినప్పటికీ.. 2013-14తో చూస్తే మాత్రం ఏకంగా 70 శాతం పుంజుకున్నాయని గుర్తుచేశారు. జూన్‌లో 4.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. జూలైలో 4.2 శాతానికి తగ్గిందన్న ఆయన తన దృష్టిలో భారత్ వంటి అత్యంత వృద్ధిదాయక దేశాల్లో 5 శాతం ద్రవ్యోల్బణం కూడా పెద్ద సమస్య కాబోదన్నారు. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో పనగరియా అధ్యాపకుడిగా కొనసాగుతున్న సంగతి విదితమే.