కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కృషిని స్వాగతించిన జగన్

దేశంలో బిజెపియేతర, కాంగ్రెసేతర పార్టీలను దరి చేర్చడం కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేస్తున్న కృషి హర్షనీయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. ఈ విషయమై కేసీఆర్ ప్రతినిధిగా టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు వచ్చి కలసిన సందర్భంగా ఇరువురు కలసి కొత్త కూటమి ఏర్పాటు గురించి సమాలోచనలు జరిపారు.

ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్‌తో చర్చించామని, జాతీయస్థాయిలో రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాల్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని జగన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాష్ర్టాలు కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు దివానా లేదంటూ  ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఇందుకు ఉదాహరణఅని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. 17 మంది తెలంగాణ ఎంపీలు కలిస్తే రాష్ర్టానికి ప్రయోజనం ఉంటుంది. 42 మంది ఎంపీలు కలిసి పోరాడితే రాష్ర్టానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యా బలం పెరగాలని స్పష్టం చేశారు.  రాష్ర్టాలు ఒకే తాటిపైకి వస్తే అన్యాయం చేసేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రాధమిక చర్చలే జరిపామని, కేసీఆర్ వచ్చి కలసినప్పుడు మరింత వివరంగా చర్చలు జరుపుతామని చెప్పారు. కేటీఆర్ ప్రస్తావించిన అంశాలను తమ పార్టీలో ముందుగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏడాది కాలంగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే జగన్‌తో భేటీ అయినట్లు చెబుతూ  ప్రజాకాంక్షకు అనుగుణంగా రాజకీయాలు ఉండాలని పేర్కొన్నారు. త్వరలో కేసీఆర్ స్వయంగా ఏపీకి వెళ్లి జగన్‌తో చర్చిస్తారని చెప్పారు. జగన్ తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాం. ఆయన సానుకూలంగా స్పందించడంతో వచ్చి వారి బృందాన్ని కలిసి అన్ని విషయాలను పంచుకున్నాం. తప్పకుండా ఒకే ఆలోచనాధోరణి ఉన్న నేతలందరూ ఒకే వేదికపై వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ ఉండాలన్న ఆలోచన ఉన్నవాళ్లు కలిసి వస్తారని మాకు విశ్వాసం ఉంది"  అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్ వైఖరిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సహా తమ ఎంపీలు అనేక సార్లు చెప్పారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. నాడు ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరామని పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో జరిగిన ఈ భేటీకి కేటీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, సంతోష్, టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి హాజరయ్యారు. భేటీలో కాంగ్రెస్, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా ఇరువురు నేతలు చర్చించారు.