నిర్ణయాలు తీసుకోగల ప్రధాని నేటి అవసరం

భారత్‌ ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, దేశ ప్రజల ఆంకాక్షలను నెరవేర్చేందుకు విస్పష్టంగా నిర్ణయాలు తీసుకోగల ప్రధాన మంత్రి నేటి అవసరం అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. పనిచేయని కూటముల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తన తాజా బ్లాగ్‌పోస్ట్‌లో హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని కొనియాడారు. అయితే 7-7.5 శాతం జీడీపీ వృద్ధితో తాము సంతృప్తిగా లేమని, 8శాతం దాటాలని కోరుకుంటున్నామని తెలిపారు. భారత్‌కు ఎవరు ప్రధాని అయినా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. 2014 ఎన్నికల్లో మాదిరిగా స్పష్టమైన మెజార్టీతో ప్రధాని పదవి చేపట్టినట్లుగానే.. ఇప్పుడు కూడా జరగాలని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధికి భరోసా ఇవ్వాలంటే.. నిర్ణయాత్మక నాయకత్వం, విధానపరమైన సూచనలకు స్థిరత్వం, బలమైన ప్రభుత్వం ఉండాలని జైట్లీ బ్లాగ్‌లో వెల్లడించారు. కానీ పనిచేయని కూటములు, వాటి నాయకత్వాల వల్ల ప్రయోజనం ఉండదని, అవి ఎంతో కాలం నిలవవని, ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదని  స్పష్టం చేశారు.

మోదీ హయాంలో జీడీపీ 7.3శాతంగా నమోదైందని చెబుతూ అంతకుముందు యూపీఏ1 హయాంలో 6.9శాతంగా, యూపీఏ2 సమయంలో 6.7 శాతం ఉందని వివరించారు. అలాగే మోదీ నాయకత్వంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గిందని తెలిపారు. గతంతో పోలిస్తే మోదీ హయాంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు.