శబరిమలపై లెఫ్ట్ ప్రవర్తన అత్యంత హేయం ... మోదీ


భారతీయ  ఆధ్యాత్మికత,సంస్కృతి, చరిత్రలపై ఏమాత్రం గౌరవం లేని కమ్యూనిస్ట్ ప్రభుత్వం శబరిమల విషయంలో వ్యవహరించిన తీరు చరిత్రలో అత్యంత హేయమైనది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కేరళలోని కాలంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ఏ పార్టీ కానీ ప్రవర్తించనంతటి అతి సిగ్గుమాలినతనంతో ఈ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులకు భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై గౌరవం లేదని మనందరికీ తెలుసునని, కానీ వారికి ఈ స్థాయిలో విద్వేషం ఉందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. 

కేరళలో ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్న యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు వంటివని ప్రధాని దుయ్యబట్టారు. వీటి పేర్లు మాత్రమే వేరు అని, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాల విషయంలో ఈ రెండూ ఒకటేనని చెప్పారు. కేరళ ప్రజలను ఈ రెండు కూటములు ఒకే విధంగా మోసం చేస్తున్నాయని విమర్శించారు. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ప్రజల మాట వినడం లేదని ఆరోపించారు. ఈ కూటములు కేరళలో శాంతి, సామరస్యాలను దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అవినీతి, మతతత్వ పార్టీలని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు స్త్రీ, పురుష సమానత్వం,  సామాజిక న్యాయం గురించి గొప్పలు చెబుతాయని, నిజానికి వాళ్ళు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని ప్రధాని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు తన ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించిన బిల్లును కాంగ్రెస్, కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు.  స్త్రీ, పురుష సమానత్వం పేరుతో ఈ పార్టీలు ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్లమెంటులో ఒకటి చెప్తుందని, పట్టణంతిట్టలో మరొకటి చెప్తుందని, శబరిమలపై ఆ పార్టీకి స్పష్టత లేదని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని ఆరోపించారు. శబరిమల వివాదంపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. శబరిమల విషయంలో తాము ప్రజలతోనే ఉన్నామని, తమ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. 

కేంద్రంలోని తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రధాని   చెప్పారు. ‘కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా రిజర్వేషన్లు తీసుకొచ్చింది. కుల, మత, వర్గ భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి అవకాశాలు దక్కాలని మేము భావిస్తాం' అని పేర్కొన్నారు.  

సులభతర వాణిజ్య విధానంలో మన దేశ ర్యాంకు మెరుగుపడుతుందని నాలుగేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. 142వ ర్యాంకు నుంచి ఇప్పుడు మనం 77వ ర్యాంకుకి చేరుకున్నామని గుర్తు చేయారు. సులభతర వాణిజ్య విధానంలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందని మోదీ అన్నారు.

బీజేపీ కార్యకర్తల శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల ఆత్మస్థయిర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. కేరళ ప్రజలు వరదలతో బాధపడుతున్నపుడు కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పని చేసిందని పేర్కొన్నారు. తాము కేరళీయులతో కలిసి నిలుస్తామని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చెర నుంచి కేరళ నన్స్‌కు విముక్తి కల్పించినట్లు గుర్తు చేశారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని, చైనాను నాలుగేళ్ళలో అధిగమించామని చెప్పారు. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  రైతుల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను చరిత్రాత్మక స్థాయిలో పెంచినట్లు వివరించారు. 

అంతకుముందు మోదీ 66వ నెంబరు జాతీయ రహదారిపై 13 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రోడ్డును ప్రారంభించారు. దీనిని రూ.352 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బైపాస్ రోడ్డు వల్ల తిరువనంతపురం నుంచి అలప్పుజ ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పునరాయి విజయం కూడా పాల్గొన్నారు.