పాక్ కు బుద్ధి చెప్పడానికి వెనుకాడం... రావత్

సరిహద్దుల వద్ద పాల్పడుతున్న చర్యలకు ప్రతిగా తాము పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి వెనకాడబోమని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత సైనికులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘సరిహద్దుల్లో పాక్‌ దాడులకు భారత బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానం చెబుతున్నాయి. అక్కడ ఉన్న మన శత్రువులను నేను హెచ్చరిస్తున్నాను. ఏవైనా హానికర చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతాం' అని స్పష్టం చేశారు. 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాం. పాక్‌ ఉగ్రవాదులకు మద్దతును కొనసాగిస్తోంది. ఆ రాష్ట్రంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదని మేము భావిస్తున్నాం. మన పక్క దేశం ఉగ్ర చర్యలను ప్రోత్సహిస్తోంది.. ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి, వారికి ఆయుధాలు కూడా ఇస్తోందని మండిపడ్డారు. 

భారత్‌-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితులను ఉద్దేశించి రావత్‌ మాట్లాడుతూ... ఇరు దేశాలు తమ భద్రతా బలగాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. తూర్పు సరిహద్దుల వద్ద శాంతి, ప్రశాంతతల కోసం కృషి కొనసాగుతోంది. అయినప్పటికీ, మేము అక్కడి పరిస్థితిని సమీక్షిస్తాం. ఆ ప్రాంతంలో మన సైనికులు ఎటువంటి రాజీ ధోరణితో వ్యవహరించబోరు. ప్రభుత్వం నుంచి వారికి అందిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నారని వెల్లడించారు. 

ఈశాన్య భారత్‌లో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని, ఆర్మీ క్రమం తప్పకుండా తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌లు కొనసాగిస్తోందని చెప్పారు. భద్రతా బలగాలతో పాటు వారి కుటుంబాలు సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని రావత్‌ సూచించారు. భవిష్యత్తులో దేశానికి భద్రతా పరమైన సవాళ్లు మరిన్ని ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గట్లు తాము సిద్ధమవుతామని, దేశ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.