మమతా ర్యాలీకి రాహుల్, మాయావతి దూరం !

2019 ఎన్నికలలో దేశంలోని ప్రతిపక్షాలకు వారధిగా, కాబోయే ప్రధాన మంత్రిగా తనను చాటుకోవడం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ నెల 19న కలకత్తాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు గత కొన్ని నెలలుగా సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని బిజెపియేతర రాజకీయ పక్షాల అగ్రనాయకులు అందరిని ఆహ్వానించారు. చివరకు రాజకీయరంగా సొంత రాష్ట్రంలో బద్ద విరోధులైన వామపక్షాల నేతలను కూడా ఆహ్వానించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.

బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా మాత్రమే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపగలమని మొదటి నుండి చెబుతున్న నేతలలో ఆమె ఒకరు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షాల ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ఆమె విముఖంగా ఒంటి వస్తున్నారు. రాహుల్ నాయకత్వంలో ఉండలేనని నేరుగా సోనియా గాంధీకే స్పష్టం చేశారు. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ భావిస్తూ ఉండడమే అందుకు ప్రధాన కారణం.

మరోవంక కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షాలైన బీఎస్పీ, ఎస్పీ నేతలు కూటమిగా ఏర్పడటం, కాంగ్రెస్ అవసరం లేదని ప్రకటించడం గమనిస్తే ప్రతిపక్షాలు అన్ని ఉమ్మడిగా బిజెపిపై పోరాడే అవకాశాలు కనిపించడం లేదు. పైగా మాయావతి, అఖిలేష్ యాదవ్ ఉమ్మడి ప్రెస్ మీట్ జరిగిన మరుసటి రోజుననే మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా అఖిలేష్ పేర్కొనడం సహజంగానే మమతాకు ఆగ్రహం కలిగిస్తున్నది.

సాధారణంగా ప్రతిపక్షాల ఉమ్మడి వేదికలకు మాయావతి దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం గత ఏడాది కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంపై మాత్రమే హాజరయ్యారు. గతనెల రాహుల్ గాంధీ సారధ్యంలో చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి సహితం ఆమె హాజరు కాలేదు. అందుచేత మమతా నిర్వహించే ర్యాలీకి ఆమె హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

మరోవంక కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సహితం ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం కనబడటం లేదు. వారిద్దరిని మమతా స్వయంగా ఆహ్వానించలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మొక్కుబడిగా ఆహ్వానం పంపారు. అందుచేతే రాహుల్ తమ పార్టీ ప్రతినిధులను మాత్రమే పంపే అవకాశం కనిపిస్తున్నది.

ఇక తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయకుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఆ సమయంలో ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభ మొదటిసారిగా సమావేశం అవుతున్నది. కాంగ్రెస్ ప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో వారితో కలసి కేసీఆర్ వేదిక పంచుకోవడానికి ఇష్టపడరు. కుమారస్వామి ప్రమాణస్వీకార సమయంలో కూడా ముందురోజు వెళ్లి కనిపించి రావడం గమనార్హం.

దేశంలో ఏర్పడి ఏ కూటమిలో కూడా ఉండబోనని ప్రకటించిన ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యే అవకాశం లేనే లేదు. శరద్ పవర్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్ వంటి నేతలు హాజరుకానున్నారు.