కుమారస్వామికి ఇద్దరు ఎమ్యెల్యేల గుడ్ బై

కర్ణాటకలోని కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకొంటున్నది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నాగేశ్ తాము కర్ణాటక ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేస్తూ గవర్నర్‌కు ఓ లేఖ రాశారు.

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ సమయంలో శంకర్ మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయన ప్రభుత్వం పట్ల అసమ్మతితో ఉన్నారు.  తాము బీజేపీకి మద్దతిస్తామని శంకర్, నాగేశ్ చెబుతున్నారు. సంకీర్ణం స్థిరమైన సుపరిపాలన అందిస్తుందని మద్దతు తెలిపానని, కానీ ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైనదని నగేష్ విమర్శించారు. సంకీర్ణంకన్నా మెరుగైన ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేయగలదని నమ్మకంతో ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

మకర సంక్రాంత్రి రోజున ప్రభుత్వం మారాలనే ఉద్దేశ్యంతో మద్దతు ఉపసంహరించు కొంటున్నట్లు మాజీ మంత్రి శంకర్ తెలిపారు.

ఇదిలావుండగా తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపీ ముంబైలో దాచిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇద్దరి మద్దతు కోల్పోవడంతో ప్రభుత్వ సుస్థిరతకు ఇబ్బంది లేకపోయినా ప్రభుత్వంలో కలకలం రేపుతున్నది. తమ ఎమ్యెల్యేలను లోబరచుకోవడానికి బిజెపి ప్రయత్నం చేస్తున్నదని డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత జి పరమేశ్వర ఆరోపించారు.

ఈ పరిణామాల పట్ల కలత చేసిన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ  కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక భగవంతుడే కాపాడాలి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అయితే తమ పార్టీ ఎమ్యెల్యేల పట్ల తమకు నమ్మకం ఉన్నదని ఆయన చెప్పారు.

మరోవంక జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి బెంగళూరుకు రాకపోవడం, అక్కడనే గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉన్నట్లు కధనాలు రావడంతో రాజకీయంగా ఆసక్తి చెలరేగుతుంది. బేజీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి కుమారస్వామే స్వయంగా ఒప్పుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పు ఆరోపించారు.

బీజేపీకి చెందిన 4 నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. కాగా, కాంగ్రెస్ నుంచి 10 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటువంటి ప్రకటనలతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి.