ముల్లపెరియార్ డ్యామ్ వివాదంలో రెండు రాష్త్రాలు

కేరళ రాష్ట్రంలో వరద బీభత్సానికి ప్రధాన కారణంగా భావిస్తున్న ముల్లపెరియార్ డ్యామ్ లో పరిమితికి మించి నీటిని నిల్వ చేయడమని స్పష్టం అవుతూ ఉండడంతో ఈ అంశం రెండు పొరుగు రాష్త్రాలు – కేరళ, తమిళనాడుల మధ్య వివాదానికి దారితీస్తున్నది. ముల్లపెరియార్  నుంచి విడుదల చేసిన జలాలే కేరళలో భారీ వరదలకు విలయానికి కారణమంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామి తోసిపుచ్చారు.  కేరళ ప్రభుత్వ ఆరోపణలు పూర్తిగా తప్పని, నిరాధారమని తిప్పికొట్టారు.

అకస్మాత్తుగా ముల్లపెరియాల్ డ్యామ్ నీరు విడుదల చేయడం తమ రాష్ట్రం వరదల్లో మునిగిపోవడానికి కారణాల్లో ఒకటంటూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. అయితే ఈ ఆరోపణలను పళనిస్వామి కొట్టివేశారు. ’ఒక డ్యామ్ (ముల్లపెరియార్) నుంచి విడుదల చేసిన అదనపు జలాలు కేరళ మొత్తం మునిగిపోవడానికి కారణమని మీరు (కేరళ) చెప్పదలచుకున్నారా?’ అని ప్రశ్నిస్తూ 80 డ్యామ్ల నుంచి విడుదల చేసిన అదనపు జలాల వల్లే ఆ రాష్ట్రం మునిగిపోయిందని అంటూ ఎదురు దాడి చేసారు.

కేరళను వరదలు చుట్టుముట్టిన వారం తర్వాత ముల్లపెరియార్ డ్యామ్ జలాలు విడుదలయ్యాయని, వరదలు వచ్చిన వెంటనే విడుదలైన జలాలు కావని ఆయన వివరించారు. మూడు హెచ్చరికలు జారీ అయ్యాయని, దశలవారిగా జలాలు విడుదలయ్యాయని పళనిస్వామి చెప్పుకోచాహ్రు. ముల్లపెరియార్ డ్యామ్ ఏర్పాటైనప్పటి నుంచి తమిళనాడు, కేరళ మధ్య కీచులాటలు జరుగుతూనే ఉన్నాయి. కేరళ ఇడుక్కి జిల్లాలో డ్యామ్ అండగా, దీని నిర్వహణా బాధ్యతలను మాత్రం తమిళనాడు ప్రభుత్వం చూసుకుంటోంది.

కాగా, ఈ నెలాఖరు వరకూ ముల్లపెరియార్ జలాశయంలో నీటిమట్టం 139 అడుగుల వరకు ఉంచాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనిస్తే ఈ విషయంలో ఆ ప్రభుత్వ వ్యవహారం కేరళకు ప్రాణంతకంగా మారిన్నట్లు భావించ వలసి వస్తున్నది. కేరళలో వరదలను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముల్లపెరియార్ ప్రాజెక్టులో నీటిమట్టం  విషయంపై ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ప్యానెల్ ఆదేశాల మేరకు పనిచేయాలని కోర్టు వెల్లడించింది.

తమిళనాడు 142 అడుగులకు బదులుగా 139.9అడుగుల నీటిమట్టం వరకు ఉంచేందుకు తమిళనాడు అంగీకరించిందని సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ కోర్టుకు వెల్లడించింది. ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా పరిగణించడంలేదని కోర్టు పేర్కొంది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశమని, దీన్ని విపత్తుకు సంబంధించిన విషయంగా చూస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.