ప్రధానికి ఫిలిప్ కొత్లెర్‌ ప్రెసిడెన్షియల్‌ పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీని మొట్టమొదటిసారి ఫిలిప్ కొత్లెర్‌ ప్రెసిడెన్షియల్‌ పురస్కారం వరించింది. ‘పీపుల్‌-ప్రాఫిట్‌-ప్లానెట్‌’ అంశాల ప్రాతిపదికన ఈ అవార్డు లభించిందని, సోమవారం దిల్లీలో మోదీ ఈ పురస్కారం అందుకున్నారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాతిపదికల కింద ఏటా ఓ దేశ నాయకుడిని ఎంపిక చేసి ఫిలిప్‌ కొత్లెర్‌ పురస్కారాన్ని అందిస్తారని ప్రకటనలో తెలిపారు. 

దేశానికి అత్యుత్తమంగా నాయకత్వం వహిస్తున్నందుకు గానూ ఈ అవార్డు లభించినట్లు పురస్కారం పత్రంలో పేర్కొన్నారు. ‘‘మోదీ దేశానికి చేస్తున్న నిస్వార్థ సేవ ఫలితంగా ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో మంచి వృద్ధి కనిపించింది. వినూత్న ఆవిష్కరణలు, తయారీ, ఐటీ ఇతర ప్రొఫెషనల్‌ సేవలకు కేంద్రంగా భారత్‌కు గుర్తింపు లభించడం మోదీ నాయకత్వంలోనే జరిగింది.’’ అని పురస్కార పత్రంలో వివరించారు.

‘‘మోదీ దూర దృష్టితో కూడిన పాలన దేశంలో డిజిటల్‌ విప్లవానికి దోహదపడింది. భారత్‌లో తయారీ, స్వచ్ఛ్‌ భారత్‌, డిజిటల్‌ ఇండియా, స్టార్ట్‌ అప్‌ ఇండియా వంటి నినాదాలు దేశానికి ఎంతో తోడ్పడ్డాయి. ప్రపంచంలోనే లాభదాయకమైన, వ్యాపార అనుకూల ప్రాంతంగా దేశం నిలిచేందుకు ఇవి దోహదం చేశాయి.’’ అని పురస్కార పత్రంలో వివరించారు. 

అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ కొత్లెర్‌ పేరుపై ఈ పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఫిలిప్‌ కొత్లెర్‌ నార్తర్న్‌ విశ్వవిద్యాలయంలోని కెలాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో మార్కెటింగ్‌ విభాగంలో సీనియర్‌ ఆచార్యుడిగా ఉన్నారు.