కర్ణాటకలో సంక్రాంతి తరవాత కొత్త ప్రభుత్వం !

ఏడు నెలలుగా రోజుకొక్క గండం దాటుకొంటూ నెట్టుకు వస్తున్న సంకీర్ణ ప్రభుత్వం సంక్రాంతి వెళ్ళగానే మరో పెనుముప్పుకు గురికానున్నదా ? సంక్రాంతి తర్వాత అక్కడ ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో అదిగో బిజెపి `ఆపరేషన్ కమల్' అమలు చేస్తున్నదని అంటూ కాంగ్రెస్ వర్గాలు గగ్గోలు పడుతున్నాయి. 

తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్యెల్యేలను ముంబయికి తరలించి అక్కడ బిజెపి నాయకుల సారధ్యంలో ఒక హోటల్ లో ఉంచారని స్వయంగా కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ ఆరోపించడంతో కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పైగా, తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగుతోందని కూడా పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఏ ముప్పు ఏర్పడినా అడ్డుకట్ట వేసెడిది శివకుమార్ కావడం గమనార్హం. 

అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి శివకుమార్ ఆరోపణలను ఖండించడం మరింతగా ఆసక్తి కలిగిస్తున్నది. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు సమాచారం ఇచ్చి ముంబై వెళ్లారని, వారితో తాను టచ్‌లో ఉన్నానని సీఎం  చెప్పడం గమనిస్తే భాగస్వామ్య పక్షాల మధ్య దూరం పెరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

గత ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి అరడజనుకు పైగా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని, వాటిని తాము విఫలయం చేశామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  అయినా ప్రభుత్వ మనుగడ పట్ల వారిలో అనుమానాలు చెలరేగుతున్నట్లు కనిపిస్తున్నది.  లోక్‌సభ ఎన్నికలలో కర్ణాటక  నుండి అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీకి అప్పటి వరకు తమ ప్రభుత్వాన్ని కొనసాగించకబోవచ్చని ఆందోళన చెందుతున్నారు. 

ప్రభుత్వం పడిపోతే జేడీఎస్ తన దారి తాను చూసుకొంటుందని, రాజకీయ మనుగడకోసం ఎన్డీయేలో చేరినా చేరవచ్చని, అప్పుడు ఒంటరిగా పోటీచేస్తే కాంగ్రెస్ పెను ముప్పు ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నారు. అందుకనే తమ ఎమ్యెల్యేలను ఆకర్షించడం కోసం బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం పట్టించుకోవడం లేదని శివకుమార్ ఆరోపించారు. 

 కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ ఝారకోలిని ఉపయోగించుకుని మద్దతు సమీకరణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రయత్నించినా ఝారకోలి నుండి సానుకూల స్పందన లేక పోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నాయి. తన వైపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిప్పుకునే ప్రయత్నం ఝారకోలి   చేస్తున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకరమే అవుతుంది. 

మరోవంక బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురైదుగురు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస​ చేసిన వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు  కూడా జాగ్రత్త పడుతున్నారు. డీఎస్‌ సైతం తమ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని చూస్తోందని ఆ పార్టీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీ తమ శాసనసభ్యులను గురుగావ్‌లోని రిసార్ట్స్‌కు తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నల్టు కధనాలు వెలువడుతున్నాయి. 

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నప్పటికీ కుమార స్వామి బేరసారాలకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీ ఎస్ యడ్యూరప్ప ధ్వజమెత్తారు.  కల్బుర్గి ఎమ్మెల్యే (బీజేపీ)కి మంత్రి పదవి, డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము న్యూఢిల్లీకి వచ్చి, తమ సమైక్యతను చాటుతున్నామని తెలిపారు.  

ఏది ఏమైనా కర్ణాటక రాజకీయాలు రాగాల ఒకటి, రెండు వారాలలో కీలక పలుపులకు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.