సెమీస్‌లోకి దూసుకెళ్లిన సింధు, సైనా

ఆసియా క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు తొలిసారి వీరు పతకాలను అందించనున్నారు.

క్వార్టర్స్‌లో సింధు థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి జిందాపోల్‌పై 21-11, 16-21, 21-14 తేడాతో విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆది నుంచి దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు.. రెండో గేమ్‌ను కొన్ని తప్పిదాలతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తనదైన షాట్లతో విజృంభించి ఆడి 21-14 తేడాతో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

అంతకుముందు మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ క్రీడాకారిణి, థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనాక్‌పై 21-18, 21-16 తేడాతో వరుస గేమ్‌ల్లో సైనా నెహ్వాల్‌ గెలిచింది. మొదటి గేమ్‌లో‌ ఇద్దరి మధ్య హోరాహోరీ నెలకొంది. 17-17, 18-18.. ఇలా నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది. అనంతరం సైనా పుంజుకుని తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో తొలి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి 21-16తో గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది.

ఈక్వెస్ట్రియన్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో భారత ఆటగాళ్లు రజత పతకాలు సాధించారు. ఈక్వెస్ట్రియన్‌ వ్యక్తిగత విభాగంలో ఫావుద్‌ మిర్జా 26.40 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఇది ఆసియా క్రీడల్లో భారత్‌కు 30వ పతకం.

ఇక టీమ్‌ విభాగంలో రాకేశ్‌ కుమార్‌, ఆశీష్‌ మాలిక్‌, జితేందర్‌ సింగ్‌, ఫావుద్‌ మిర్జాలతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో జపాన్‌ తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలవగా.. థాయ్‌లాండ్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్‌ గెలుచుకున్న పతకాల సంఖ్య 31(7 స్వర్ణాలు, 7 రజతాలు, 17 కాంస్యాలు)కి చేరాయి.