అఖిలేష్ - మాయావతి పొత్తులో అప్పుడే లుకలుకలు!

ముప్పై ఏళ్లకు పైగా ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థులుగా పరస్పరం నేతల తూటాలు వదులుతున్న ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తు కుదుర్చుకున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే ఆ పార్టీలలో అపశృతులు వినిపిస్తున్నాయి. ఈ పొత్తు ఎక్కడిదాకా వెళ్ళిననే అనుమానాలు ఆ పార్టీల లోని వారికే కలుగుతున్నాయి. చేరి 38 సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించినా, ఆ సీట్లు ఏవో తేల్చడం అంత సులభం కానీ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పొత్తు పట్ల ఎస్పీ  నేత ఒకరు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పార్టీలో పలువురు ఈ పొత్తు పట్ల విముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ కూటమి కొనసాగాలంటే మాయావతి ముందు అఖిలేశ్‌ ఎల్లప్పుడూ వినమ్రతతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మాయావతి ఆధిపత్య ధోరణులు కూటమి మనుగడను ప్రశ్నార్ధకరం చేయగలవని అంటూ నేరుగా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. దీంతో అప్పుడే ఇరు పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని విమర్శలు వస్తున్నాయి.

ఎస్పీ ఎమ్మెల్యే హరిఓం యాదవ్‌  ఈ పొత్తు మనుగడ పట్ల అనుమానం వ్యక్తం చేశారు.  ఫిరోజాబాద్‌లో ఈ కూటమి పనిచేయదని స్పష్టం చేశారు. ‘మాయావతి ఏది చెప్పినా అందుకు మా పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ తల ఊపుతూ ఉన్నంత కాలమే ఈ కూటమి కొనసాగుతుంది. లేదంటే విడిపోతుంది’ అని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థానంలోనే ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్సాగంజ్‌ అసెంబ్లీ నియోజక వర్గం ఉంది.

"కూటమి కోసం మాయావతి చెప్పిన విధంగా అఖిలేష్‌ వింటున్నారు. వీరి పొత్తుపై కొందరు ఎస్పీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఫిరోజాబాద్‌ లోక్‌సభ పరిధిలో కూటమి అస్సలు ఫలించదు. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఎస్పీ, బీఎస్పీ ప్రత్యుర్థులుగా తలపడుతున్నాయి’’ అంటూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ కు ఊహించని షాక్‌ ఇచ్చారు.

‘నేతాజీ (యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌) వంటి నేత ఉన్న సమయంలోనే ఇటువంటి కూటమి కొనసాగలేదు. ఇక ఇప్పుడు ఎలా కొనసాగుతుంది?’ అని హరిఓం యాదవ్‌ ప్రశ్నించారు.

ఓవైపు బీజేపీని ఓడిస్తామని ధీమాతో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి ఎదుర్కొనే లక్ష్యంతో దశాబ్దాల వైరుధ్యాన్ని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన కూడా విడుదల కాకముందే సొంతపార్టీ ఎమ్మెల్యేనే ఇలా వ్యాఖ్యానించడం ఎస్పీ నేతలకు మింగుడుపడటం లేదు.

ఇలా ఉండ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం మాయావతి మీడియా సమావేశం నిర్వహించి, తమ కూటమిపై మరిన్ని వివరాలను వెల్లడించ గలరని చెబుతున్నారు.