ఎన్‌ఐఏ దర్యాప్తుపై బాబుకు భయం ఎందుకు !

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిపై దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించటం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాన్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కొట్టివేశారు. విమానాశ్రయంలో దాడి జరిగినందున ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మొదట వాదించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్‌ఐఏకు అప్పగించటాన్ని విమర్శించటం విడ్డూరంగా ఉన్నదని నరసింహారావుతోపాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. 

ఎన్‌ఐఏ దర్యాప్తు పట్ల చంద్రబాబుకు భయమెందుకని వారు ప్రశ్నించారు. గతంలో ఒక కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తును స్వాగతించిన చంద్రబాబు ఇప్పుడు వ్యతిరేకించటం పలు అనుమానాలకు తావిసోందని తెలిపారు. అవసరం ఉన్నప్పుడు ఈ సంస్థలను పొగిడే మీరు ప్రత్యర్థుల విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తున్నారని వారు నిలదీశారు.

 కాకినాడలో బీజేపీ నాయకురాలిపై చంద్రబాబుప్రదర్శించిన అసహనం ఆయన అభద్రతా భావానికి అద్దం పడుతోందని నరసింహారావు ధ్వజమెత్తారు. కిడారి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు కావాలని అడిగిన ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలన దేశ చరిత్రలో ససువర్ణాక్షరాలతో లిఖించపడుతుందని కన్నా చెప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిలో చంద్రబాబుకు హస్తం ఉన్నది కాబట్టే ఆయన భయపడుతున్నారని దుయ్యబట్టారు. వాల్మీకి బోయల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు.


అమరావతి పెద్ద భూ కుంభకోణం  

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల నుంచి 33 వేల ఎకరాలను సేకరించారని,  అమరావతి ప్రపంచంలోనే పెద్ద భూ కుంభకోణమని  ఏపీ బీజేపీ వ్యవహారాల సహఇంచార్జ్   సునీల్‌  దేవ్‌ధర్  ఆరోపించారు.  భోగాపురం విమానాశ్రయాన్ని కమీషన్ల కోసం తన మిత్రులకు అప్పజెప్పారని విమర్శించారు.  కాంగ్రెస్‌ను ఓడించేందుకు పుట్టిన తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలపటం సిగ్గుచేటని  సనీల్ దేవ్‌ధర్ మండిపడ్డారు.