కరడుగట్టిన ఉగ్రవాది సహా ఇద్దరు హతం

కరడుగట్టిన ఉగ్రవాది సహా మరో ఉగ్రవాదిని ఆదివారం భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ లో  హతమార్చాయి. వీరిలో అల్‌-బదర్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఏ++ కేటగిరీ ఉగ్రవాది జీనత్‌-ఉల్‌-ఇస్లామ్‌ ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇతనితోపాటు మృతి చెందిన షకీల్‌ దార్‌ అనే ఉగ్రవాది కలిసి గతంలో అనేక ఉగ్ర నేరాలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. 

వీరు 2015 నుంచి ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు. అల్‌-బదర్‌ సంస్థను బలోపేతం చేసేందుకు గతేడాది నవంబరులో ఉగ్రవాది జీనత్‌-ఉల్‌-ఇస్లామ్‌.. హిజ్బుల్‌ ముజాహిదిన్‌ నుంచి ఈ సంస్థలో చేరాడని పోలీసులు వివరించారు.

ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారం మేరకు శనివారం సాయంత్రం కుప్వారా జిల్లా యారిపోరాలోని కత్‌పోరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు పోలీసులు చేపట్టినట్లు తెలిపారు.

 ‘‘తొలుత ఉగ్రవాదులు భద్రతా దళాలపైకి కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం వారికి లొంగిపోయేందుకు అవకాశం కూడా ఇచ్చాం. అయినా వారు కాల్పులు ఆపలేదు.’’ అని పోలీసులు వివరించారు.