జగన్ తో మాజీ డిజిపి భేటిపై దుమారం

మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు తమ ప్రాంతంలో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని `మర్యాదపూర్వకంగా’ కలుసు కావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆ భేటి తరవాత మాజీ డిజిపి త్వరలో తమ పార్టీలో చేరబోతున్నట్లు వైసిపి రాజ్యసభ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించడంతో మరింత ఆసక్తి రేకేక్తించింది.

విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను కలిసిన సాంబశివరావు కలసి సుమారు 30 నిమిషాలపాటు ఏకాంతంగా మంతనాలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ సాంబశివరావు వైసిపికి తురుపుముక్కగా మారనున్నారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. పైగా మాజీ డిజిపి సలహాలు కూడా తీసుకొని పార్టీని ముందుకు నడిపిస్తామని చెప్పుకొచ్చారు.

మరోవంక, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో తనకున్న అనుబంధాన్ని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త యు.వి.రమణమూర్తిరాజు(కన్నబాబు)తో మాజీ డీజీపీ కొద్దిసేపు పంచుకోవడంతో మరింతగా ఆసక్తి కలిగించింది.

వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుండి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేయడానికి కూడా మాజీ డిజిపి రంగం సిద్దం చేసుకున్నారనే కధనాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత ఈ కధనాలను త్రోసుపుచ్చుతూ వైసిపి అధినేత జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సాంబశివరావు స్పష్టం చేసినా ప్రయోజనం లేకపోయింది. తాను గంగవరంపోర్టు సీఈవో హోదాలో విశాఖ వచ్చిన జగన్‌ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని తెలిపారు. పైగా, ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేమీ లేదని కుడా స్పష్టం చేసారు.

సీనియర్ అధికారులను కాదని ఇంతకు ముందు సాంబశివరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిజిపిగా నీయమించడం అప్పట్లో పోలీస్ ఉన్నతాధికార వర్గాలలో అసంతృప్తికి దారితీసింది. అయితే కొన్ని అంశాలలో ఆయన పనితీరు నచ్చని చంద్రబాబునాయుడు డిజిపిగా పదవీకాలం పొడిగించడం పట్ల ఆసక్తి కనబరచక పోవడం, ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో కీలకమైన పదవి కట్టబెడతారని ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో సాంబశివరావు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ఉద్యోగ విరమణ చేయగానే  గంగవరంపోర్టు సీఈవో పదవి ఇచ్చినా అంతా సంతృప్తిగా లేరని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ముఖ్యమంత్రిని కలసి మంతనాలు జరిపారు. ఇంతలో జగన్ ను కలవడంతో రాజకీయంగా దుమారం చెలరేగడానికి దారితీసింది.

గత ఎన్నికల ముందు కుడా టిడిపి, బిజెపి సీట్ల కోసం విఫల ప్రయత్నం చేసి, వైసిపిలో చేరి పోటీ చేసి ఓటమి చెందిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి ఎన్నికలు పూర్తి కాగానే బిజెపిలో చేరడం గమనార్హం.