ఉగ్రవాదులకు అవకాశమే ఇవ్వని మోదీ ప్రభుత్వం


దేశంలో శాంతికి భంగం కలిగించేందుకు ఉగ్రవాదులకు ఎటువంటి అవకాశమూ ఇవ్వబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరూపించిందని  రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ కొనియాడారు. బిజెపి జాతీయ మండలి సమావేశాల్లో మాట్లాడుతూ మోదీని గద్దె దించేందుకు సాయం కోరడానికి.. ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు పాకిస్థాన్‌కు వెళ్లారు. ఇది సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 

యూపీఏ పాలనలో అవినీతి ప్రబలిపోయిందని, ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట పడలేదని,  పాలనలో విధానాలన్నీ పక్షపాత ధోరణితో ఉండేవని, పేదరికంపై ఆ ప్రభుత్వం దృష్టి పెట్టలేని ఆమె ధ్వజమెత్తారు. అందుకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని, తాము భారీ మెజార్టీతో గెలిచామని పేర్కొన్నారు.  

‘పాకిస్థాన్‌, భారత్ పరస్పరం యుద్ధం చేసుకోకూడదని, మనం పోరాడాల్సింది పేదరికంపై అని మోదీ చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు. ఈ విధానాన్ని భారత్ పాటిస్తోందని,  ప్రభుత్వం ఈ దిశగానే దేశంలో వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. 2014లో తామేము అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో భారీ ఉగ్రదాడి ఒక్కటి కూడా జరగలేదని ఆమె గుర్తు చేశారు. 

ఈ ఐదేళ్లలో దేశం శాంతి, భద్రతలతో ఉందన్న విషయాన్ని ప్రజలకు మనం గుర్తు చేయాలని ఆమె సూచించారు.  ఎన్డీఏ పాలనలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదని చెబుతూ సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనే నినాదంతో మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. మన ప్రభుత్వ సంస్కరణలు కొనసాగాలని చెప్పారు. 

 దేశంలో ఉగ్రదాడులు జరగకుండా చేయడం, అవినీతి లేకపోవడం అనే రెండు అంశాలు ఎన్డీఏ ప్రభుత్వ గొప్ప విజయాలుగా చెప్పుకోవచ్చని నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.