కూటములతో వచ్చేది అరాచక పాలనే

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడే ప్రతిపక్షాలకు చెందిన ఏ మహాకూటమయినా అరాచకాన్ని, అవినీతిని, రాజకీయ అస్థిరతను సృష్టిస్తుందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. బిజెపి జాతీయ మండలి సమావేశాల్లో ప్రసంగిస్తూ ఒకరంటే ఒకరికి పడని వారు కూడా ఇప్పుడు మహా కూటమి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా బిజెపి పనిచేస్తుందని, ప్రజలందరి విశ్వాసాలను బిజెపి గౌరవిస్తుందని ఆయన చెప్పారు. కులతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని పెంచిపోషించిన కాంగ్రెస్ పార్టీ గడచిన 50 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధికి దూరం చేసిందని ఆయన ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 2014 ఎన్నికల కన్నా మెరుగైన ఫలితాలను సాధించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

యూపీలో సమాజ్‌ వాదీ పార్టీ నాలుగు సార్లు అధికారంలో ఉంది.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ మూడు సార్లు అధికారంలో ఉంది.. కానీ ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా ఎందుకు లేవని యోగి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏడాదిన్నరలో ప్రధానమంత్రి  ఆవాజ్‌ యోజన కింద 18లక్షల మంది పేద ప్రజలకు ఇళ్లు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. ఎస్పీ ప్రభుత్వంలో కేవలం 63వేల మందికి మాత్రమే ఇళ్లు వచ్చాయన్నారు.

 ప్రధాని మోదీ కృషి వల్లే శతాబ్దాల కాలం నాటి కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంలో బలమైన, సమర్థవంతమైన ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  'కూటమి కావచ్చు, మహాకూటమి కావచ్చు. 2014 ఎన్నికల్లో కంటే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించి తీరుతుంది' అని ఆయన స్పష్టం చేశారు.