ప్రతిపక్షాలకు బలమైన ప్రభుత్వం అవసరం లేదు : మోదీ మండిపాటు

దేశంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, వారికి దృఢమైన నిర్ణయాలు తీసుకోలేని, రాజీధోరణులు అవలంభించే `తప్పనిసరి' ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అందుకనే అవి `మహాకూటమి'గా ఏర్పడే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బీజేపీ జాతీయ మండలి రెండు రోజుల సమావేశాలలో ముగింపు ప్రసంగం చేస్తూ వారికి తమ కుటుంబాల ప్రయోజనాలు కాపాడగల ప్రభుత్వం అవసరమని, అయితే దేశనైకి బలమైన ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకొంటున్న కూటములు పూర్తిగా అవకాశవాదంతో ఇమిడి ఉన్నయని చెబుతూ ఈ మధ్య తెలంగాణలో అటువంటి కూటమి ఘోరంగా విఫలమైనదని గుర్తు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న నేత తనకు ముఖ్యమంత్రిగా కన్నా ఒక క్లర్క్ గా పనిచేస్తున్నట్లు వాపోయాడని ఎద్దేవా చేశారు.

నేడు దేశం మొత్తం బిజెపి వైపు చూస్తోందని చెబుతూ `ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి బిజెపిపై నమ్మకం ఉంచారు. కార్యకర్తల శక్తి, సమష్టి కృష్టితో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. బిజెపి కార్యకర్తలంతా సురక్షితులు, సంస్కారవంతులు. కార్యకర్తల త్యాగాలపై ఎదిగిన పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది’ అని ఆయన కొనియాడారు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  తనను వేధించడం కోసం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థను ఉపయోగించుకున్నదని మోదీ గుర్తు చేశారు. చివరకు అమిత్ షాను జైలుకు పంపారని చెప్పారు. "ఇప్పుడు మనకు అధికారం ఉంది. మనకు చట్టం గురించి తెలుసు. అయితే మనం ఎవ్వరిని వేధించడం లేదు. మనం న్యాయవ్యవస్థ, సిబిఐ వంటి వ్యవస్థలు చట్టం ప్రకారం పనిచేసుకోనాలని మాత్రమే కోరుకొంటున్నాం. సిబిఐని ఉపయోగించి నన్ను వేధించే ప్రయత్నం చేసినా నేను తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కొన్నాను. కానీ సిబిఐ గుజరాత్ లో పనిచేయడానికి వీల్లేదనై అడ్డు చెప్పలేదు" అని పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు  సీబీఐని నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. వారికి సిబిఐ అంటే భయం ఎందుకు అని ప్రశ్నించారు.

ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా సుదీర్ఘకాలం సాగిన ప్రభుత్వం తమదే అని మోదీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పాలన కారణంగా (2004-14) పదేళ్లు దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందనీ, విలువైన సమయాన్ని కాంగ్రెస్‌ పాలకులు వృథా చేశారని మండిపడ్డారు. ఆ పదేళ్లు దేశమంతా అవినీతి స్కాంలు, కుంభకోణాల్లో మినిగితేలిందని ఆరోపించారు.

అయితే దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న ఎవ్వరిని ఈ `చౌకీదార్' (సేవకుడు) వదిలే ప్రశ్న లేదని ప్రధాని  హెచ్చరించారు. "వారు నన్ను ఎన్ని అవమానాలకైనా గురి చేయవచ్చు. కానీ నా కర్తవ్యం నుండి నా దృష్టి మల్లించ లేరు" అని స్పష్టం చేశారు.

అయోధ్య వంటి సమస్యలకు పరిష్కారం కుదరకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులే సుప్రీం కోర్ట్ లో ఈ కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారని గుర్తు చేశారు. నెలల తరబడి సెలవులు అంటూ విదేశాలకు వెళ్లే `చౌకీదార్' (సేవకుడు) కావాలో, విరామం యెరుగకుండా దేశం కోసం పనిచేసే వ్యక్తి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.

దశాబ్దాల నిర్లక్ష్యంతో రైతులు కుదేలైపోయారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటిన్నర రెట్ల ఆదాయం లభించినప్పుడే రైతుల ముఖాలు చిరునవ్వుతో ఉంటాయని చెబుతూ ఈ దేశ రైతులకు నూతన జవసత్వాలు ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కడుపునింపేందుకు ప్రయత్నిస్తున్నాని పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం కేవలం అభివృద్ధి పథంగా కొనసాగుతోందని చెబుతూ ఆ లక్ష్యంగానే నిరంతరంగా కొనసాగుతున్నాని ప్రధాని తెలిపారు. సబ్‌ కా సాత్‌ అనేది సర్కార్‌ ఒకదాని వల్ల కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.