ఎమర్జెన్సీ యోధులను స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలి

1975-77లలో ఎమర్జెన్సీ సమయంలో దేశంలో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం పోరాడిన యోధులను `స్వతంత్ర సమర యోధులు’గా ప్రభుత్వం గుర్తించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఎమర్జెన్సీ పోరాట యోధులు విజ్ఞప్తి చేసారు. ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల భారతీయ లోకతంత్ర సేనాని సంయుక్త సంఘర్ష్ సమితి జాతీయ కార్యవర్గ సమావేశంలో 24 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమితి అద్యక్షుడు గోవర్ధన్ ప్రసాద్ అటల్ అద్యక్షత వహించారు.

ఎమర్జెన్సీ సమయంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు, పోలీస్ ల నుండి ఎదురైన చిత్రహింసలు, వేల సంఖ్యలో మిసా, డిఐఆర్ ల క్రింద అరెస్ట్ కావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశం కోసం తాము జరిపిన  త్యాగాలకు తగు గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసారు.

సమితి ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ యాదవ్ హైదరాబాద్ నుండి పాల్గొంటూ ఇప్పటికి ఆనాటి యోధులలో అనేకమంది కుటుంభ పరంగా అనేక ఇబ్బందులను ఎడుర్కొంటున్నారని తెలిపారు. అయితే 10 రాష్ట్రాలలో ప్రభుత్వాలు వారికి పెన్షన్ తో పాటు ఉచిత వైద్య, రవాణా వంటి సహాయం చేస్తున్నాయని చెప్పారు. నెలకు రూ 10 నుండి రూ 25 వేల వరకు పెన్షన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేసారు.

ఆనాడు జైళ్ళకు వెళ్ళిన వారిలో ఇప్పటికి సుమారు 50 వేల మంది వరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి గుర్తింపు పొందటం లేదని తెలిపారు. అందుకనే ప్రధాన మంత్రి దేశమంతటా ఒకే విధానం ఉండే విధంగా చూడాలని, వారిని స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ పోరాట యోధులను గౌరవించడం తమ విధి అంటూ ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్ హై కోర్ట్ లు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన్నట్లు గుర్తు చేసారు. అటువంటి యోధులకు సహకారం అందించడం `దాతృత్వం’ కిందకు రాదనీ మద్రాస్ హై కోర్ట్ స్పష్టం చేసింది.

ఇట్లా ఉండగా, 1921-22 నాటి మోప్ల తిరుగుబాటు దారులు, 1919-1922 నాటి ఖిలాఫత్ ఉద్యమం, త్రావేనకోర్ లో స్వతంత్ర వ్యతిరేక పోరాటం వంటి దేశ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ లు ఇస్తున్నాయని సమావేశం విస్మయం వ్యక్తం చేసింది.  2017-20 సంవత్సరాలలో ఖర్చు పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ 2525కోట్లు కేటాయించగా, 1980 నుంచి సుమారు రూ8000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఈ నిధులలో అత్యధిక భాగాన్ని దళారులు స్వాహ చేస్తున్నారని ఆరోపిస్తూ, వాటి నివియోగంపై తగు దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసారు.